![]() |
![]() |

త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాల్లో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ ఉన్న వాటిలో 'యానిమల్' ఒకటి. రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 1న విడుదల కానుంది. కేవలం ప్రీ టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. అంతటి అంచనాలున్న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల రైట్స్ ని దిల్ రాజు తక్కువ ధరకు దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది.
'యానిమల్' తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైట్స్ ని దిల్ రాజు రూ.15 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. హిందీ సినిమాల పరంగా చూస్తే ఇది మంచి రేటే అయినప్పటికీ.. 'యానిమల్'పై ఉన్న బజ్, సందీప్ రెడ్డి బ్రాండ్ దృష్ట్యా ఇది తక్కువే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 'అర్జున్ రెడ్డి'తో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి మొదటి సినిమాతోనే ఘన విజయం సాధించి తనకంటూ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో సందీప్ రెడ్డి సినిమాల ప్రకటనలు రాగానే ఆ హీరోల ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎక్సైట్ అయ్యారంటే.. అతను ఒక్క సినిమాతోనే ఎంతలా ప్రభావం చూపాడో అర్థం చేసుకోవచ్చు.
పైగా షారుఖ్ ఖాన్ రీసెంట్ మూవీ 'జవాన్' తెలుగు రాష్ట్రాల్లో రూ.18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా, ఇప్పటికే రూ.10 కోట్లకు పైగా లాభాలను చూసింది. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ అయినప్పటికీ షారుఖ్ స్టార్డంతో ఈస్థాయి కలెక్షన్స్ వచ్చాయి. తెలుగులో జవాన్ మాస్ కే ఆ రెస్పాన్స్ వస్తే, ఇక సందీప్ రెడ్డి చూపించబోయే ఊరమాస్ యానిమల్ కి ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందా అనే అంచనాలు ఉన్నాయి. పైగా అప్పుడు అప్ కమింగ్ హీరో అయిన విజయ్ దేవరకొండతో కొత్త దర్శకుడిగా వచ్చి అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించాడు సందీప్. కానీ ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో పాటు రణబీర్, రష్మిక వంటి స్టార్స్ కూడా తోడయ్యారు. వీటిని బట్టి చూస్తే దిల్ రాజు తక్కువ ధరకే 'యానిమల్' తెలుగు రైట్స్ దక్కించుకున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
![]() |
![]() |