![]() |
![]() |

స్టార్ హీరోలు ఒక్కో సినిమా కోసం ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు. ఇక రాజకీయాలతో బిజీగా ఉంటే, ఒక్క సినిమా పూర్తి చేయడానికే చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరి ఊహలకు అందనట్టుగా ఒకేసారి వేగంగా రెండు మూడు సినిమాలు పూర్తి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హర వీరమల్లు' వంటి సినిమాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలలే సమయం ఉండటంతో.. పవన్ మహా అయితే 'ఓజీ'ని పూర్తి చేస్తారేమో అనుకున్నారంతా. కానీ పవన్ 'ఓజీ'తో పాటు జెట్ స్పీడ్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్'ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. 'ఓజీ' శరవేగంతో చిత్రీకరణ జరుపుకుంటోంది. చాలావరకు షూటింగ్ పూర్తయిందనే విషయం తెలిసిందే. అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' స్పీడ్ కూడా అదే రేంజ్ లో ఉందంట. ఇప్పటికే షూటింగ్ దాదాపు నలభై శాతం పూర్తయిందని టాక్. 'ఓజీ'తో పాటు దీని షూటింగ్ కూడా శరవేగంతో జరుగుతోందట. అన్ని అనుకున్నట్లు జరిగితే ఎన్నికల లోపే ఈ రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశముంది అంటున్నారు. అంతేకాదు మరోవైపు 'హరి హర వీరమల్లు'ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారట.
రాజకీయాలతో అంత బిజీగా ఉండి కూడా పవన్ ఈ స్పీడ్ లో సినిమాలు పూర్తి చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి సినిమాలు త్వరగా పూర్తి చేసి, ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టాలి అనుకుంటున్నారో? లేక తనకి తెలిసిందే నటనే కాబట్టే, వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేసి, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని పార్టీని నడపడానికి, సేవ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారో? ఆయనకే తెలియాలి.
![]() |
![]() |