![]() |
![]() |

ఒకేసారి రెండు పడవల మీద ప్రయాణం చేయడం అంత తేలిక కాదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. సినిమా, రాజకీయం అనే రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. దీంతో రాజకీయాల కారణంగా ఆయన సినిమాలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఆయన సినిమాల పరిస్థితి ఏంటనే చర్చలు జరుగుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బాబుని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ప్రజాగళం బలంగా వినిపిస్తోంది. ఆ గళానికి పవన్ కూడా శృతి కలిపారు. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని స్వరం వినిపిస్తున్న పవన్.. తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇదే ఇప్పుడు పవన్ సినిమా షూటింగ్స్ కి అడ్డంకిగా మారింది.
ప్రస్తుతం పవన్ నటిస్తున్న మూడు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్' యాక్షన్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ మాసివ్ షెడ్యూల్ కోసం సెప్టెంబర్ 7న పవన్ సెట్స్ లో అడుగుపెట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్ కావడంతో పవన్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా లేవు. ఈ లెక్కన 'ఉస్తాద్ భగత్ సింగ్' షెడ్యూల్ ఆలస్యమయ్యే అవకాశముంది. మరోవైపు పవన్ 'ఓజీ' చిత్రాన్ని వేగంగా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' షెడ్యూల్ వాయిదా పడితే, ఆ ప్రభావం 'ఓజీ' కొత్త షెడ్యూల్ పై పడే ఛాన్స్ ఉంది. ఈ రెండు సినిమాల కంటే కూడా 'హరి హర వీరమల్లు' పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. ఈ చిత్రాన్ని ప్రకటించి చాలా కాలమే అవుతోంది. కానీ కొంతభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. బాగా పలు కారణాల ఆలస్యమవుతూ వస్తోంది. అయితే సెప్టెంబర్ మూడో వారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారట. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ షెడ్యూల్ వాయిదా పడటం ఖాయమంటున్నారు.
![]() |
![]() |