![]() |

ఇండియాలో బయోపిక్‌ల హవా నడుస్తున్న నేపథ్యంలో మరో కొత్త బయోపిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా పేరు తెచ్చుకున్న ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన ‘800’ చిత్రం ట్రైలర్‌ను సెప్టెంబర్ 5న ముంబైలో విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సచిన్ టెండూల్కర్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
ఎం.ఎస్.శ్రీపతి దర్శకత్వంలో ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ దేశవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ ‘’మై వెరీ డియర్ ఫ్రెండ్ మురళీధరన్‌కి ఆల్ ది బెస్ట్. అతని జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. అతని కోసమే నేను ఇక్కడికి వచ్చాను’’ అన్నారు.ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ ‘’నా కోసం ఇక్కడికి వచ్చి మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న సచిన్ టెండూల్కర్‌కి థాంక్స్. నేను కూడా సచిన్ ఫ్యాన్. క్రికెట్‌లో ఆయన సాధించినది ఎవరూ సాధించలేరు’’ అన్నారు.
చిత్ర సమర్పకులు శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ‘’ఈ సినిమాను విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ట్రైలర్ విడుదల చేసిన సచిన్‌గారికి థాంక్స్’’ అన్నారు. దర్శకుడు ఎంఎస్ శ్రీపతి మాట్లాడుతూ... ‘’ఇది మానవత్వంతో కూడిన కథ. ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళడానికి కారణమైన వివేక్ రంగాచారికి థాంక్స్’’ అన్నారు. మధుర్ మిట్టల్ మాట్లాడుతూ ‘’మురళీధరన్‌గారి పాత్రలో నటించడం ఓ బాధ్యత. ఆ అవకాశం నాకు వచ్చిందంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు వెంకట్ ప్రభు పా.రంజిత్, క్రికెటర్ సనత్ జయసూర్య, ‘800’ చిత్రనిర్మాత వివేక్ రంగాచారి, మహిమా నంబియార్, యు.ఎఫ్.ఓ మూవీస్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు.
![]() |