![]() |
![]() |
.webp)
స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ బరిలోకి దిగితే థియేటర్ల దగ్గర ఉండే సందడే వేరు. అయితే ఇప్పుడు రీరిలీజ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వార్ కి దిగుతున్నాయి. ఈ వారం ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతుండటం విశేషం.
ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాల్లో 'మన్మథుడు' కూడా ఒకటి. అక్కినేని నాగార్జున హీరోగా విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచయిత కావడం విశేషం. 2002 డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రాన్ని 20 ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ ప్రేక్షకులు టీవీలు, ఓటీటీల్లో ఎంతో ఇష్టంగా చూస్తుంటారు. ఇందులో ప్రేమ సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు, సంగీతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నాగార్జున పుట్టినరోజు కానుకగా ఆగస్టు 29న రీరిలీజ్ అవుతోంది.
.webp)
నందమూరి బాలకృష్ణ నటించిన ఎవర్ గ్రీన్ సినిమాలలో 'భైరవ ద్వీపం' ఒకటి. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ఈ జానపద చిత్రంలో రోజా హీరోయిన్ గా నటించింది. 1994 ఏప్రిల్ 14 విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచి అమితంగా ఆకట్టుకుంది. ఇందులో కురూపిగా బాలయ్య నటనకు ప్రశంసలు దక్కాయి. అద్భుతమైన కథాకథనాలు, విజువల్స్, సంగీతంతో ఈ సినిమా ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. 29 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ క్లాసిక్ ఫిల్మ్ మరోసారి థియేటర్లలో అలరించనుంది. నటుడిగా బాలకృష్ణ 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆగస్టు 30న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు.
.webp)
పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్ జంటగా నటించిన చిత్రం 'గుడుంబా శంకర్'. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించిన ఈ సినిమాకి వీరశంకర్ దర్శకత్వం వహించారు. 2004 సెప్టెంబర్ 10న విడుదలైన ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ.. పవన్ మ్యానరిజమ్స్, కామెడీ సన్నివేశాలు, మణిశర్మ స్వరపరిచిన పాటలు ఫ్యాన్స్ ని అలరించాయి. 19 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. పవన్ పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 2న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది.
.webp)
ఇలా ఒకే వారం ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. మరి వీటిలో వసూళ్ల పరంగా ఏ చిత్రం పైచేయి సాధిస్తుందో చూడాలి.
![]() |
![]() |