![]() |
![]() |

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు హిట్టు ఫ్లాప్ లను పక్కనపెట్టి వారు తీసుకునే రెమ్యూనేషన్‌ను బట్టి వారి స్థానాన్ని నిర్ణయిస్తారు. ఎవరు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారో వారే నెంబర్ వన్ అన్నట్టుగా పరిశ్రమ తీరు ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ ఉంటేనే అంత అమౌంట్ ఇస్తారు కాబట్టి. అంటే ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై రూల్ వర్కౌట్ అవుతుందన్నమాట. ఇక విషయానికి వస్తే.. ఇప్పుడు సౌత్ ఇండియా గాక ఇండియా మొత్తంలో కూడా అత్యధిక స్థాయిలో రెమ్యూనేషన్ అందుకుంటున్న వారిలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఒకరు.
ఈయన అతి తక్కువ కాలంలోనే చాలా బిజీ సంగీత దర్శకునిగా మారిపోయారు. ఇప్పుడు ఆయన తన సంగీతాన్ని మెల్లగా అన్ని భాషల్లోకి విస్తరింప చేస్తున్నారు. ధనుష్ నటించిన 'త్రీ' చిత్రంలో "వై దిస్ కొలవెరి కొలవెరి" పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిన అనిరుధ్ ఆ తరువాత మారి, వేదాళం, వివేగం, అజ్ఞాతవాసి, పేట, జెర్సీ, గ్యాంగ్ లీడర్ వంటి పలు చిత్రాలకు పనిచేశారు. వీటిలో పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', నాని నటించిన 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' వంటి చిత్రాలు ఉండటం విశేషం.
ఇక ప్రస్తుతం ఆయన ఇటీవలే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కమలహాసన్ నటించిన సంచలన చిత్రం 'విక్రం'కు సంగీతమందించారు. ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఉన్న అజిత్ మూవీ 'తునివు' చిత్రానికి ఇతనే సంగీతం అందిస్తున్నారు. దీనికి పోటీగా వస్తున్న విజయ్ చిత్రం 'వారిసు'కు తమన్ సంగీత దర్శకుడు కావడం విశేషం. దీంతో తమిళనాడులో ఈ పొంగల్ విజయ్ వర్సెస్ అజిత్ లాగానే అనిరుధ్ వర్సెస్ తమన్ అన్నట్లుగా కూడా టర్న్ తీసుకుంది.
ఇక తెలుగులో 'వీరసింహారెడ్డి'కి సంగీతమందిస్తున్న తమన్, 'వాల్తేరు వీరయ్య'కు సంగీతమందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ మధ్య పోటీ ఉంది. దాంతో టాలీవుడ్లో తమన్, దేవిశ్రీప్రసాద్‌లలో ఎవరు పై చేయి సాధిస్తారు... తమిళంలో తమన్, అనిరుధ్‌లలో ఎవరిది పై చేయి అనేది సంక్రాంతి నాటికి తేలిపోతుంది. ఇక ప్రస్తుతం తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ మంచి కంటెంట్ ఉన్న ప్రాజెక్టులు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అనిరుధ్. 2023లో అయితే అనిరుధ్ చాలా పెద్ద సినిమాలతో సందడి చేయబోతున్నారు. ముందుగా అజిత్ 62వ సినిమాకు సంగీత దర్శకునిగా అనిరుధ్ ఎంపికైన విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్ కుమార్ తో విఘ్నేష్ చేస్తోన్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. మరోవైపు శంకర్- కమలహాసన్ కాంబినేషన్లో వస్తున్న 'ఇండియన్ 2'కి కూడా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాకు సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రం వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక షారుఖ్ ఖాన్ -అట్లీల కాంబినేషన్లో రూపొందుతున్న బాలీవుడ్ మూవీ 'జవాన్'కు ఆయనే సంగీత దర్శకులు.
కాగా చాలా కాలం తర్వాత ఆయన తెలుగులో మరో సినిమాకు ఓకే చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తలకెక్కనున్న ఎన్టీఆర్ 30వ సినిమా చేసేందుకు అనిరుధ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా అనిరుధ్ మరికొన్ని సౌత్ సినిమాలు చేయడానికి రెడీ అవుతూ బాలీవుడ్ చిత్రాలను కూడా ఓ రౌండ్ వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన దేశంలోని సంగీత దర్శకులు అందరికంటే ఎక్కువ పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారట. ఆయన అడిగినంత ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధంగా ఉండటంతో ప్రస్తుతానికి సంగీత దర్శకులలో అనిరుద్దే నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు.
![]() |
![]() |