![]() |
![]() |

తెలుగులో రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేష్, చంద్రమోహన్ వంటి వారి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన హీరోగా అల్లరి నరేష్ ని చెప్పుకోవచ్చు. రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే కామెడీ హీరో ఎవరు? అని అందరు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న సమయంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అల్లరోడు వరంగా లభించారు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఈవీవీ సత్యనారాయణ తనయుడైన అల్లరి నరేష్.. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అల్లరి' చిత్రం ద్వారా సినిమా ప్రపంచంలోకి ప్రవేశించారు. దాంతో ఆయన మొదటి చిత్రం పేరైన 'అల్లరి' ఆయనకు ఇంటిపేరుగా మారింది.
తెలుగులో అతి వేగంగా చిత్రాలు చేసి అతి తక్కువ సమయంలోనే అత్యధిక చిత్రాలలో హీరోగా నటించిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇక ఈయనలో కేవలం కామెడీ నటుడే కాదు.. ఎంతో విభిన్నమైన యాక్టర్ ఉన్నాడు. ఆయన నటించిన నేను, ప్రాణం, డేంజర్, విశాఖ ఎక్స్‌ప్రెస్, గమ్యం వంటి పలు చిత్రాలను దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన 'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రాలు కూడా ఆ కోవలోనివే.
ఇక ఎందుకనో ఈయన కెరీర్ ఆమధ్య వరుస పరాజయాలతో డల్ అయింది. ఆ సమయంలో ఆయన ఇతర హీరోలు, సీనియర్లతో కూడా కలిసి నటించారు. మంచు మోహన్ బాబుతో 'మామ మంచు అల్లుడు కంచు', కమెడియన్ కం హీరో సునీల్ తో కలిసి 'సిల్లీ ఫెలోస్' చిత్రాల్లో కలిసి నటించారు. ఆ తరువాత మహేష్ బాబు హీరోగా నటించిన 'మహర్షి' చిత్రంలో ఓ మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రను చేశారు.
కాగా త్వరలో ఈయన కింగ్ నాగార్జునతో కూడా కలిసి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగార్జున, అల్లరి నరేష్ కలయిక దాదాపు ఖాయమని చెప్పాలి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు పలు రకాల కాంబినేషన్స్ సెట్ చేసే మేకర్స్ ఈసారి నాగార్జున, అల్లరి నరేష్‌లను కలుపుతున్నారు. వీరిద్దరు కూడా స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీగా ఉన్నారు. పలు హిట్ చిత్రాలకు రచయితగా పనిచేసి తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన 'ధమాకా' వంటి హిట్ మూవీకి సైతం పనిచేసిన ప్రసన్నకుమార్ బెజవాడ తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకొని ఓ సినిమా చేయనున్నారు.
ఈ సినిమాలో ఇంపార్టెంట్ పాత్రలో అల్లరోడు కనిపిస్తారని అంటున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రసన్నకుమార్ బెజవాడను డైరెక్టర్‌ని చేస్తోన్న ఘనత కింగ్ నాగార్జునకు దక్కుతుంది. ఇటీవల నాగ్ కెరీర్ కూడా ఆటుపోట్లతో సాగుతోంది. దాంతో ఈసారి తనను కాస్త విభిన్నంగా చూపిస్తాడనే నమ్మకంతో ప్రసన్నకుమార్ బెజవాడకు కింగ్ అవకాశం ఇస్తున్నారు. గతంలో కూడా చాలా మంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చిన చరిత్ర నాగ్‌కు ఉంది. వీరిలో చాలామంది దర్శకులుగా తర్వాతి కాలంలో మంచి స్థాయికి చేరుకున్నారు.
ఇలా ప్రసన్నకుమార్ బెజవాడ మెగాఫోన్ చేతబట్టే తొలి చిత్రంలో ఓ పాత్రకు అల్లరి నరేష్ బాగుంటాడని నాగ్ తో పాటు దర్శకుడు కూడా భావించడం, అల్లరోడికి పాత్రను చెప్పగా ఆయనకు సైతం నచ్చడంతో ఈ మూవీలో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మొత్తానికి అల్లరోడు.. నాగార్జున లాంటి సీనియర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. నరేష్‌కి కూడా ఈ సినిమా మంచి బూస్టింగ్ ఇస్తుందని అంటున్నారు.
ధమాకాతో రీసెంట్‌గా హిట్ అందుకున్న ప్రసన్నకుమార్ ఫస్ట్ టైం డైరెక్షన్‌లో ఎలాంటి సినిమా చేస్తాడు? అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంతో నమ్మకం పెట్టుకున్న 'ది ఘోస్ట్' చిత్రం షాక్ ఇవ్వడంతో ఈసారి టార్గెట్ మిస్ కాకుండా నాగార్జున జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమాలో నాగార్జున పాత్ర కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. మరి నాగార్జున- అల్లరి నరేష్ కాంబోలో ప్రసన్నకుమార్ బెజవాడ చేస్తున్న ఈ మూవీ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
![]() |
![]() |