Home  »  News  »  సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు.. అందరూ మునిగినట్టేనా?

Updated : Oct 25, 2022

స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రెండు మూడు విడుదలైతేనే థియేటర్ల కొరత ఏర్పడుతుంది. అలాంటిది ఒకేసారి నాలుగైదు పెద్ద సినిమాలు విడుదలైతే ఇంకేమన్నా ఉందా?. అందుకే ఈసారి సంక్రాంతి పోరుపై రెండు నెలల ముందే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటిదాకా ఏకంగా ఐదు సినిమాలు సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో అసలు ఒకేసారి ఐదు పెద్ద సినిమాలు విడుదలవ్వడం సాధ్యమేనా?.. చివరికి పోరులో నిలిచేది ఎవరు? తప్పుకునేది ఎవరు? అనే చర్చలు మొదలయ్యాయి.

అందరికంటే ముందుగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ఆదిపురుష్' విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న విడుదల అవుతుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అలాగే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న 'వారసుడు' కూడా సంక్రాంతికే వస్తుందని తెలిపారు. వీటితో పాటు చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' చిత్రాలలో ఏదో ఒకటి సంక్రాంతికి వస్తుందని భావించారంతా. ఎందుకంటే ఈ రెండు చిత్రాలను నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్సే కావడంతో.. రెండూ ఒకేసారి వచ్చే అవకాశం లేదని, ఏదో ఒక్క చిత్రమే సంక్రాంతికి వస్తుందని అనుకున్నారంతా. కానీ ఊహించని విధంగా ఈ రెండు చిత్రాలు సంక్రాంతికే విడుదలవుతున్నట్టు దీపావళి కానుకగా వచ్చిన అప్డేట్స్ ద్వారా స్పష్టమైంది. ఈ నాలుగు చాలవు అన్నట్టు సంక్రాంతి రేసులోకి ఐదో సినిమా కూడా వచ్చి చేరింది. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్' కూడా సంక్రాంతికే రానుందని తాజాగా ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు.

హీరోలు, దర్శకనిర్మాతలు, బడ్జెట్ పరంగా చూస్తే ఈ ఐదు సినిమాలు పెద్దవే. ఈ చిత్రాలపైన ఉన్న హైప్, పెట్టిన పెట్టుబడి, జరిగిన బిజినెస్ పరంగా చూస్తే ఈ చిత్రాలు భారీ సంఖ్యలో థియేటర్స్ లో విడుదల కావాలి. ఎందుకంటే ఒకప్పటిలా తక్కువ థియేటర్స్ లో విడుదలై ఎక్కువరోజులు ఆడేరోజులు ఎప్పుడో పోయాయి. ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేసి తక్కువ రోజుల్లోనే వీలైనంత రాబట్టుకోవడం ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. అంటే ఒక పెద్ద సినిమా వస్తుందంటే.. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదలై ఒకట్రెండు వారాల్లో మొత్తం రాబట్టేలా ఉండాలి. కానీ ఇలా ఒకేసారి నాలుగైదు సినిమాలు విడుదలైతే మాత్రం హిట్ టాక్ వచ్చినా సినిమాలు భారీగా నష్టపోయే అవకాశముంది.

'ఆదిపురుష్' దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్నట్లు అంచనా. ఆ సినిమాకి పండగ సీజన్ ఎంత ముఖ్యమో, ఇతర భారీ చిత్రాలతో పోటీ లేకపోవడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే ఈ చిత్రం భారీ సంఖ్యలో థియేటర్స్ లో విడుదలై అంతమొత్తం రాబట్టగలదు. 'వారసుడు' పేరుకి తమిళ్ హీరో సినిమా అయినప్పటికీ నిర్మాత దిల్ రాజు కావడంతో తెలుగులో భారీస్థాయిలో విడుదలవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నైజాంలో భారీగా థియేటర్లు ఆక్రమించే అవకాశముంది. ఇక సీనియర్ స్టార్స్ చిరు, బాలయ్యల సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్ల దగ్గర ఉండే సందడే వేరు. అలాంటిది ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఈ సినిమాలు ఒకేసారి విడుదల కావడం సంచలనంగా మారింది. ఈ రెండు సినిమాలలో దేనిపైన మైత్రి సంస్థ ఎక్కువ దృష్టి పెడుతుంది? బిజినెస్ ఏంటి? థియేటర్ల సర్దుబాటు ఎలా? అనేవి అంతుచిక్కని ప్రశ్నలు. ఈ నాలుగు సినిమాలూ భారీస్థాయిలో విడుదలయ్యే సినిమాలే. ఒకేసారి విడుదలైతే థియేటర్ల కొరతతో అన్ని సినిమాలు నష్టపోయే అవకాశముంది. ఇవి సరిపోవు అన్నట్టు 'ఏజెంట్' వస్తే దానిపై బజ్ ఉన్నప్పటికీ ఈ చిత్రాల నడుమ నలిగిపోవడం గ్యారెంటీ.

చిన్న సినిమాల విడుదల తేదీని ముందుకో వెనక్కి జరిపించి తమ సినిమాలను సాఫీగా విడుదల చేసుకునే బడా నిర్మాతలు ఇలా ఒకేసారి ఇన్ని పెద్ద సినిమాలు విడుదలవుతుంటే ఎందుకు చర్చలు జరపట్లేదు అన్నది విమర్శలకు తావిస్తోంది. పైగా ఒకే సంస్థ నుంచి రెండు సినిమాలు పోరుకి దిగుతుండటం మరింత వివాదాస్పదమవుతోంది. ఇంకా సంక్రాంతికి రెండు నెలలకు పైగా సమయముంది. ఈలోపు చర్చలు జరిపి కనీసం రెండు సినిమాలనైనా పోరు నుంచి తప్పిస్తారో లేదా అన్ని సినిమాలను విడుదల చేసి అందరూ నష్టపోతారో చూడాలి.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.