Home  »  News  »  ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం.. రాజంటే ఇలా ఉండాలి!

Updated : Oct 23, 2022

తెలుగు హీరోలలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళే చాలా తక్కువ. అలాంటిది రెబల్ స్టార్ ప్రభాస్ ఏకంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'బాహుబలి'తో ఆయన గ్లోబల్ స్టార్ గా మారడమే కాకుండా మిగతా హీరోలు సైతం తన బాటలో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు చేసేలా చేశాడు. అందుకే మనకు పాన్ ఇండియా, గ్లోబల్ స్టార్ అనే పదాలు వింటే ముందుగా ప్రభాసే గుర్తుకొస్తాడు.

ఒకప్పుడు కృష్ణుడు, రాముడు అంటే ఎన్టీఆర్ గుర్తొచ్చేవారు, తెరపై ఆయన ఆహార్యం అలాంటిది. అలా ఆరడుగుల ఎత్తు, గంభీరమైన స్వరం, కండలు తిరిగిన దేహంతో, అమరేంద్ర బాహుబలిలా ప్రభాస్ ఠీవిగా నడిచి వస్తుంటే, రాజంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్ల కలెక్షన్, కోట్లాది హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆ కటౌట్ కి మైనపు ప్రతిమను బ్యాంకాక్‌లో మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రతిష్టించారు.

నిర్మాతగా ఉన్న తండ్రి సూర్య నారాయణ రాజు, హీరోగా చేసిన పెద్దనాన్న కృష్ణం రాజు తర్వాత వారసుడిగా ఈశ్వర్ తో పరిశ్రమలోకి అడుగుపెట్టి 'వర్షం', 'ఛత్రపతి', 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'మిర్చి', 'బాహుబలి-1', 'బాహుబలి-2' లాంటి భారీ విజయాలని సాధిస్తూ ప్రభాస్ 20 ఏళ్ళలో ప్రతి చిత్రానికి చాలా కష్టపడుతూ, తనని తాను ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటూ, రెబెల్ స్టార్ నుండి పాన్ ఇండియన్ స్టార్ స్థాయిని దాటి అంతర్జాతీయ అభిమానులని గెలుచుకున్నాడు. అసలు ప్రభాస్ లేకపోతే బాహుబలి చిత్రమే లేదు అని దర్శధీరుడు రాజమౌళి స్వయంగా అన్నారంటే అతని డెడికేషన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి వచ్చినా కూడా ఏ మాత్రం గర్వం లేకుండా తన సహ నటులతో మిగతా బృందంతో ఆప్యాయంగా 'డార్లింగ్‌' అని పిలుస్తూ పిలిపించుకుంటూ ఉంటారు ప్రభాస్‌. తన కేరిర్ లో ఎలాంటి కాంట్రవర్సీ జోలికి పోకుండా తనతో పని చేసిన దిగ్గజ నిర్మాతలు, దర్శకులు మళ్ళీ మళ్ళీ తనతో పని చేయాలనిపిస్తుంది అని చెప్తున్నారంటే నటుడిగా తన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్ధమవుతుంది.

ప్రస్తుతం ప్రభాస్ చిత్రం కోసం టాలీవుడ్ బాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'ఆదిపురుష్'. వాల్మీకి రామాయణంలో రాముడి వర్ణన కి తగ్గట్టుగా ఉండే ఆహార్యం సహజంగానే ఉన్న ప్రభాస్ ఇందులో రాఘవ రాముడిగా కనిపించనుండగా పూర్తి 3డి టెక్నాలజీ తో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం కనువిందు చేయనుంది.

అలాగే కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ హీరోగా డార్క్ సెంట్రిక్ థీం టెక్నాలజీ ని వాడుతూ తెరకెక్కుతున్న ఇండియాలో మొట్ట మొదటి భారీ చిత్రం 'సలార్'. ఇందులోని యాక్షన్, విజువల్స్ ఇదివరకెన్నడూ చూడని స్థాయిలో ఉంటాయని చిత్రంలో నటించిన నటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులు చెప్పడం విశేషం.

వైజయంతి మూవీస్ లాంటి ప్రఖ్యాత నిర్మాణ సంస్థలో దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కె' పై విపరీతమైన అంచనాలున్నాయి. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ లాంటి పాన్ ఇండియన్ నటులు ఇందులో భాగమవుతుండగా, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ తోడవ్వడం తో ఈ చిత్రానికి ప్రపంచ దేశాల్లో భారీ మార్కెట్ దక్కనుంది. ఇది కాక అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తోనూ దర్శకుడు మారుతితో కూడా భారీ చిత్రాలు త్వరలో మొదలవ్వనున్నాయి.

గత 20 ఏళ్లు గా ప్రభాస్ ఎన్నో సేవా సహాయ కార్యక్రమాలు చేసాడు. వరదలు వచ్చినపుడు, కోవిడ్ సమయంలోనూ ఎన్నో భారీ విరాళాలు ఇచ్చారు. అలాగే 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకోవడమే కాక అందులో తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ అభివృద్ధి కి కావలసిన ఎన్నో సౌకర్యాలు సమకూర్చారు. ఇలా రెబల్ స్టార్ గా మాత్రమే కాక మంచి మనసున్న మహారాజుగా అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ప్రభాస్‌ మరెన్నో అద్భుత విజయాలు సాధించాలని అక్టోబర్‌ 23న పుట్టినరోజు సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.