Home  »  News  »  అయ్యయ్యో.. హిట్ టాక్, కలెక్షన్లు వీక్!

Updated : Oct 11, 2022

"సినిమా బాగుంది కానీ ఎందుకనో అప్పుడు ఆడలేదు", "సినిమా బాగుంది కానీ సరైన టైంలో రిలీజ్ చేయలేదు" అనే మాటలు తరచూ వింటుంటాం. సినిమాని బాగా తీయడం ఎంత ముఖ్యమో, సినిమాని సరైన సమయానికి విడుదల చేయడం కూడా అంతే ముఖ్యం. లేదంటే సినిమా బాగుందనే టాక్ వచ్చినా, హిట్ గా నిలవదు. ప్రస్తుతం 'స్వాతిముత్యం' చిత్రం పరిస్థితి అలాగే ఉంది.

పెద్ద హీరోల సినిమాలతో పాటు విడుదలై చిన్న సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన సందర్భాలు తెలుగులో చాలా ఉన్నాయి. 2017 సంక్రాంతికి ఓ వైపు చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150', మరోవైపు బాలకృష్ణ 'గౌతమిపుత్ర శాతకర్ణి' ఉన్నా.. శర్వానంద్ నటించిన 'శతమానం భవతి' విడుదలై ఘన విజయం సాధించింది. ఈ మూడు సినిమాలు ఒకేరోజు విడుదల కాలేదు. ఒకట్రెండు రోజుల తేడాతో వరుసగా విడుదలయ్యాయి. పైగా సంక్రాంతి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమాలకు భారీ ఆదరణ ఉంటుంది. అందుకే చిరంజీవి, బాలకృష్ణ సినిమాల ప్రభంజనంలోనూ 'శతమానం భవతి' సత్తా చాటింది.

సంక్రాంతి లాగే దసరా కూడా తెలుగు వారికి పెద్ద పండగ. దసరా సమయంలోనూ తెలుగు వారు సినిమాలకు పెద్ద పీట వేస్తారు. ఆ నమ్మకంతోనే పోటీగా చిరంజీవి 'గాడ్ ఫాదర్', నాగార్జున 'ది ఘోస్ట్' ఉన్నా 'స్వాతిముత్యం' చిత్రాన్ని మేకర్స్ విడుదల చేసుంటారు. కానీ వారి అంచనాలు తలకిందులయ్యాయి. సినిమాకి హిట్ టాక్ వచ్చినా, హిట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

చిరంజీవి, నాగార్జున సినిమాలు ఒకేరోజు విడుదలవుతున్నప్పుడు కాస్త ముందో వెనకో కాకుండా సరిగ్గా అదే రోజు విడుదల చేయడం 'స్వాతి ముత్యం' టీమ్ చేసిన తప్పు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్ వచ్చే పరిస్థితి లేదు. 'బింబిసార', 'సీతా రామం', 'కార్తికేయ-2' వంటి సినిమాలు ఘన విజయం సాధించాయంటే.. ఆ సమయంలో పెద్ద సినిమాలు విడుదల కాలేదు. ఆ సినిమాలు బాగున్నాయని మౌత్ టాక్ ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్ళడంతో పెద్ద ఎత్తున థియేటర్లకు కదిలారు. కానీ 'స్వాతి ముత్యం'కి ఆ అవకాశం లేకుండా పోయింది.

'గాడ్ ఫాదర్' విడుదలైన రోజే విడుదలవ్వడంతో 'స్వాతి ముత్యం'పై ప్రేక్షకుల దృష్టి పెద్దగా పడలేదు. రివ్యూలు పాజిటివ్ గా వచ్చినా, చూసిన కొందరు బాగుందని చెప్పినా.. 'గాడ్ ఫాదర్'కి కూడా సూపర్ హిట్ రావడంతో 'స్వాతి ముత్యం'ని అంతగా ఎవరూ పట్టించుకోలేదు. అలా కాకుండా దసరా సెలవులను టార్గెట్ చేసి కొంచెం ముందుగా సెప్టెంబర్ 30న విడుదల చేసుంటే బాగుండేది. ఆ సమయంలో 'పొన్నియన్ సెల్వన్' ఉన్నా తెలుగులో 'గాడ్ ఫాదర్'తో పోల్చితే పావు వంతు కూడా ప్రభావం చూపలేదు. పైగా దసరాకి విడుదల చేయడమంటే.. దసరా రోజు విడుదల చేయడం కాదు, కాస్త ముందు విడుదల చేస్తేనే దసరా సెలవులను కవర్ చేయగలమన్న విషయాన్ని గ్రహించి ఉంటే బాగుండేది. పోనీ కనీసం ఈ వచ్చే శుక్రవారం విడుదల చేసినా బాగుండేది. ఎందుకంటే ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు. ఇలా విడుదల తేదీ గురించి ముందే బాగా ఆలోచించి సరైన తేదీకి విడుదల చేసినట్లయితే 'స్వాతి ముత్యం' ఖచ్చితంగా మంచి విజయాన్ని అందుకునేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.