![]() |
![]() |

సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్. ముఖ్యంగా హీరోయిన్లకు అందం అనేది చాలా ముఖ్యం. అందం తగ్గిపోతే అవకాశాలు తగ్గిపోయినట్టే. అందుకే అందాన్ని కాపాడుకోవడానికి ఏవేవో చేస్తుంటారు. కొందరు ఉన్న అందం సరిపోక సర్జరీలు చేయించుకుంటారు. మరికొందరు పెళ్ళయ్యి, తల్లయినా తమ అందం ఏ మాత్రం తరిగిపోకూడదన్న ఉద్దేశంతో సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనిస్తుంటారు.
'దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి' అన్నట్టుగా.. 'అందం ఉండగానే అవకాశాలు అందిపుచ్చుకోవాలి' అనేదాన్ని హీరోయిన్లు బాగా ఫాలో అవుతుంటారు. సినిమాలకు కాస్త విరామం ఇస్తే చాలు.. తమ స్థానాన్ని మరో కొత్త హీరోయిన్ భర్తీ చేస్తుందన్న ఉద్దేశంతో వివాహం ఆలస్యంగా చేసుకుంటారు కొందరు. మరికొందరేమో పిల్లల్ని ఆలస్యంగా కంటారు. ఇంకా కొందరైతే సినిమాలకు ఏ మాత్రం విరామం ఇవ్వకుండా సరోగసి ద్వారా మాతృత్వాన్ని పొందుతున్నారు.
కాజల్ అగర్వాల్, అలియా భట్ లాంటి ఒకరిద్దరు హీరోయిన్లు తప్ప ఎక్కువగా సరోగసికే ఓటేశారు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది. ఎందరో హీరోయిన్లు సరోగసి ద్వారానే తల్లయ్యారు. వారిలో ప్రియాంకా చోప్రా, శిల్పాశెట్టి, ప్రీతీ జింటా, సన్నీ లియోన్ వంటి వారున్నారు. వీరితో పాటు ఎందరో బాలీవుడ్ స్టార్స్, దర్శకనిర్మాతలు కూడా సరోగసి ద్వారా తల్లిదండ్రులైన వారున్నారు. ఆ లిస్టులో ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, ఫరా ఖాన్ ఇలా ఎందరో ఉన్నారు.
సౌత్ సెలెబ్రిటీలలో సరోగసి ద్వారా తల్లి అయినవారు చాలా తక్కువగా ఉన్నారు. టాలీవుడ్ నుంచి నటి మంచు లక్ష్మి సరోగసి ద్వారానే తల్లి అయింది. ఇక తాజాగా ఆ లిస్టులో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార చేరిపోయింది. ఈ ఏడాది కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకున్న ఆమె తాజాగా సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లి అయింది.
![]() |
![]() |