Home  »  News  »  దర్శకుడిగా త్రివిక్రమ్ మొదటి సినిమా.. 'నువ్వే నువ్వే'కి 20 ఏళ్ళు

Updated : Oct 10, 2022

'స్వయంవరం', 'చిరునవ్వుతో', 'నువ్వే కావాలి', 'నువ్వు నాకు నచ్చావ్' వంటి చిత్రాలకు రచయితగా పనిచేసి మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా  పరిచయం చేస్తూ.. ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించిన సినిమా 'నువ్వే నువ్వే'. తరుణ్, శ్రియ జంటగా నటించారు. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నేటికి(అక్టోబర్ 10వ తేదీకి) ఈ సినిమా విడుదలై 20 ఏళ్ళు. 

కాలంతో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు మన మనసులను తాకుతాయి. అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అటువంటి సినిమాల్లో 'నువ్వే నువ్వే' ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇరవై ఏళ్ళైనా, ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా చూస్తారు. ప్రేమ, కుటుంబ అనుబంధాలకు వినోదం మేళవించి రూపొందించిన సినిమా 'నువ్వే నువ్వే'. కూతురిపై తండ్రి ప్రేమను మాత్రమే కాదు, బాధ్యతను హృద్యంగా చూపించారు.
 
'నువ్వే నువ్వే' విడుదలై 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్మాత రవికిశోర్ మాట్లాడుతూ.. ''నా మనసుకు దగ్గరైన సినిమా 'నువ్వే నువ్వే'. 'నువ్వే కావాలి' షూటింగ్ సమయంలోలో త్రివిక్రమ్ ఈ కథ చెప్పాడు. నాకు నచ్చడంతో 'ఈ కథకు నువ్వే దర్శకుడు' అని చెప్పేశా. ఆ తర్వాత 'నువ్వు నాకు నచ్చావ్' సాంగ్స్ కోసం న్యూజిల్యాండ్ కలిసి వెళ్లాం. ఆ టైమ్‌లో మరో కథ చెప్పాడు. ఏది చేసినా తనకు ఓకే అన్నాడు. 'నువ్వే కావాలి' టైమ్‌లో చెప్పిన కథతో ముందుకు వెళ్లాం. అయితే 'నువ్వే నువ్వే' స్టార్ట్ చేసే సమయానికి 'నువ్వు నాకు నచ్చావ్' విడుదలై భారీ విజయం సాధించింది. అప్పుడు త్రివిక్రమ్‌ను దర్శకుడిగా పరిచయం చేయడం కోసం చాలా నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తన తొలి చిత్రాన్ని మా 'స్రవంతి మూవీస్'లో చేస్తానని చెప్పాడు. అలాగే చేశాడు. 'నువ్వే నువ్వే' సినిమా ప్రారంభించే సమయానికి త్రివిక్రమ్ టాప్ రైటర్. త్రివిక్రమ్ లాంటి ప్రతిభావంతుడిని దర్శకుడిగా పరిచయం చేసినందుకు ఇప్పటికీ నాకు సంతోషంగా ఉంటుంది. 'స్రవంతి'లో వచ్చిన సినిమాల్లో ముందు వరుసలో ఉండే సినిమాల్లో ఇదొకటి. నేను సగర్వంగా చెప్పుకొనే సినిమా. ఇప్పుడు చూసినా ఫ్రెష్ గా ఉంటుంది. 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి గారు రాసిన పాటలు, త్రివిక్రమ్ డైలాగులు, కోటి సంగీతం, హరి అనుమోలు సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, పేకేటి రంగ ఆర్ట్ వర్క్, తరుణ్-శ్రియ లవ్ సీన్స్, ప్రకాశ్ రాజ్- శ్రియ మధ్య సంభాషణలు గొప్పగా ఉంటాయి. 'అమ్మ ఆవకాయ్ అంజలి ఎప్పుడూ బోర్ కొట్టవు' డైలాగ్ రాశాక... త్రివిక్రమ్ అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పాడు. మా మధ్య ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్, అన్నవరం, ఊటీ, ముంబై, స్విట్జర్లాండ్ ‌ల‌లో షూటింగ్ చేశాం. 'అయామ్ వెరీ సారీ' పాటను ఊటీలోని కాలేజీలో షూటింగ్ చేశాం. అప్పట్లోనే ఆ పాటకు అరవై లక్షల వరకూ ఖర్చు పెట్టాం. 'కంప్యూటర్లు... ఆర్ట్స్... సైన్స్...' పాట కూడా అక్కడే తీశాం. పది రోజులు మేమంతా ఊటీలో ఉన్నాం. ఇంటర్వెల్ గోల్ఫ్ కోర్ట్ సీన్ కోసం ముంబై వెళ్లాం. తరుణ్, శ్రియ మధ్య బీచ్ సీన్ కూడా! ఆ రెండిటినీ ఒక్క రోజులో చేశాం. 'ఇష్టం' సినిమా చూసి శ్రియను సంప్రదించాం. తన చదువుకు అంతరాయం కలుగుతుందని తొలుత ఆమె ఆసక్తి చూపించలేదు. అప్పుడు ఢిల్లీలో వాళ్ళింటికి వెళ్లి కథ చెప్పాం. వెంటనే అంగీకరించింది. ఇటువంటి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఈ సినిమాతో ముడిపడి ఉన్నాయి. ఇప్పటికీ ఎవరో ఒకరు 'నువ్వే నువ్వే' సినిమా, అందులో మాటలు, పాటల గురించి నాకు చెబుతుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది'' అని అన్నారు.

'నువ్వే నువ్వే' చిత్రానికి ప్రేక్షకుల అభిమానంతో పాటు పురస్కారాలూ దక్కాయి. నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో 'సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్'గా 'నువ్వే నువ్వే' నిలిచింది. వెండి నందిని 'స్రవంతి' రవికిశోర్‌కి అందించింది. ఉత్తమ సంభాషణల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నంది అవార్డు అందుకున్నారు. ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్ రాజ్ పురస్కారం అందుకున్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.