![]() |

మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించే దర్శకులు అరుదుగా ఉంటారు. అందులో వీవీ వినాయక్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'ఆది'(2002) సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం అప్పట్లో టాలీవుడ్ బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. డైరెక్ట్ గా 96 కేంద్రాలలో 100 రోజులు ఆడిన ఈ చిత్రం తారక్ కి స్టార్ ఇమేజ్ తీసుకు రావడమే కాకుండా వినాయక్ ని మొదటి సినిమాకే టాప్ డైరెక్టర్ హోదాని తీసుకొచ్చింది.
'ఆది' వంటి బ్లాక్ బస్టర్ తో దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన వినాయక్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. 'చిన్నకేశవ రెడ్డి', 'దిల్', 'ఠాగూర్', 'బన్ని', 'లక్ష్మీ', 'కృష్ణ', 'అదుర్స్' ఇలా వరుస విజయాలతో టాప్ కమర్షియల్ డైరెక్టర్ గా ఎదిగారు. ముఖ్యంగా చిరంజీవితో ఆయన చేసిన 'ఠాగూర్'(2003) సినిమాతో అప్పట్లో ఆయన టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారారు. ఆయనతో సినిమా చేయడానికి టాప్ స్టార్లందరూ ఆసక్తి చూపేవారు. అయితే కొంతకాలంగా ఆయన హవా తగ్గింది. ఆయన డైరెక్ట్ చేసిన గత ఆరు చిత్రాలలో 'నాయక్', 'ఖైదీ నెంబర్ 150' మినహా మిగతా నాలుగు సినిమాలు నిరాశపరిచాయి.
2018 లో వచ్చిన 'ఇంటిలిజెంట్' తర్వాత వినాయక్ దర్శకత్వంలో ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే ఇప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేయబోతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'ఛత్రపతి'(2005)ని బెల్లంకొండ శ్రీనివాస్ తో ఆయన హిందీలో రీమేక్ చేస్తున్నారు. 20 ఏళ్ళ క్రితం 'ఆది'తో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వినాయక్.. బాలీవుడ్ లోనూ అదే రేంజ్ లో ఎంట్రీ ఇస్తారేమో చూడాలి. అలాగే వినాయక్ తానే హీరోగా సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈరోజు(అక్టోబర్ 9) వినాయక్ పుట్టినరోజు. ఈ ఏడాది ఆయనకు చాలా కీలకం. ఓ వైపు ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ.. మరోవైపు హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా ఉండాలని ఆశిద్దాం.
![]() |