![]() |
![]() |

కొన్నాళ్ల క్రితం టాలీవుడ్‌లోని అగ్ర దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు శ్రీను వైట్ల. ఆనందం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, రెడీ, కింగ్, నమో వెంకటేశ, బాద్‌షా లాంటి హిట్లు, 'దూకుడు' లాంటి బ్లాక్‌బస్టర్ అందించారాయన. అయితే ఆగడు మూవీ నుంచి ఆయన తీసిన బ్రూస్‌లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు వరుసగా ఫ్లాపయ్యేసరికి ఒక్కసారిగా ఆయన స్థాయి కిందికి పడిపోయింది.
ఒకప్పుడు ఆయనతో సినిమాలు చేయడానికి ఆరాటపడిన పెద్ద స్టార్లు ముఖం చాటేశారు. మంచు విష్ణుతో మరోసారి కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్న ఆయన, 'డీ అండ్ డీ' మూవీని చాలా కాలం క్రితమే అనౌన్స్ చేశారు కానీ, అది సెట్స్ మీదకు వెళ్లలేదు. ఇప్పుడు ఆయన తన తదుపరి మూవీని అనౌన్స్ చేశారు. ఫస్ట్ టైమ్ ఆయన హీరో గోపీచంద్‌తో కలిసి పనిచేయనున్నారు. దసరా పర్వదినం సందర్భంగా ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకున్నారు.
"ఈ శుభప్రదమైన రోజు, నా నెక్ట్స్ మూవీని గోపీచంద్‌తో చేయనున్నానని అనౌన్స్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నా దీర్ఘ కాల మిత్రుడు, రచయిత గోపీమోహన్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. త్వరలో మిగతా వివరాలు తెలియజేస్తాను. మీ ప్రేమకు ధన్యవాదాలు, మీ ఆశీర్వాదాలు కావాలి" అని ట్వీట్ చేశారు శ్రీను వైట్ల. ఆయన హిట్ మూవీస్‌లో రచయితలు కోన వెంకట్, గోపీమోహన్ పాత్ర ఎంతో ఉంది. 'బాద్‌షా' సందర్భంగా ఏర్పడిన విభేదాలతో వారు విడిపోయారు. ఇప్పుడు గోపీమోహన్ తిరిగి శ్రీను వైట్లతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు.
శ్రీను వైట్ల తరహాలోనే గోపీచంద్ కెరీర్ కూడా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 'లౌక్యం', 'జిల్' సినిమాల తర్వాత వచ్చిన ఎనిమిది సినిమాల్లో ఏదీ సంతృప్తికరమైన విజయాన్ని అందించలేదు.
![]() |
![]() |