![]() |
![]() |

'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన తమిళ అమ్మాయి వాణీ భోజన్. కెరీర్ ఆరంభంలో పలువురు హీరోలు తమ సినిమాల్లో హీరోయిన్‌గా తనను తీసుకోవడానికి ఇష్టపడలేదనీ, దానికి కారణం తను టీవీ రంగం నుంచి రావడమేననీ రివీల్ చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాక, తనను అదివరకు రిజెక్ట్ చేసిన కొంతమంది హీరోలను తాను కూడా రిజెక్ట్ చేశానని చెప్పింది.
టీవీ తారలు బిగ్ స్క్రీన్‌పై అడుగుపెట్టి పేరు తెచ్చుకోవడం కోలీవుడ్‌కు కొత్తేమీ కాదు. ఉదాహరణకు స్టార్ హీరో శివకార్తికేయన్, స్టార్ కమెడియన్ సంతానం టీవీలో కమెడియన్లుగా రాణించి, ఆ తర్వాత వెండితెరకు వచ్చినవాళ్లే. వారి తరహాలోనే టీవీలో సక్సెస్ అయ్యాక వెండితెర మీదకు అడుగుపెట్టిన వాణీ భోజన్.. తనదైన ముద్ర వేస్తోంది. టీవీలో నటించేప్పుడు 'చిన్నితెర నయనతార' అని అభిమానులు ఆమెను పిలుచుకొనేవాళ్లు.
టీవీలో రాణించాక, షమ్మీర్ సుల్తాన్ డైరెక్ట్ చేసిన తెలుగు సినిమా 'మీకు మాత్రమే చెప్తా' మూవీతో వెండితెరపై అడుగుపెట్టింది వాణి. ఆ మూవీలో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ ప్రధాన పాత్రధారులు. దాని తర్వాత అశోక్ సెల్వన్ హీరోగా నటించిన తమిళ సినిమా 'ఓ మై కడవులే' సినిమాలో హీరోయిన్‌గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది వాణి. ఆ సినిమా తెచ్చిన పేరుతో చియాన్ విక్రమ్ మూవీ 'మహాన్'లో అవకాశం దక్కించుకుంది. దురదృష్టవశాత్తూ, నిడివి సమస్యతో ఆమె చేసిన సీన్లను మూవీ నుంచి తొలగించారు.
ఇటీవల ఓటీటీలో వచ్చిన వెబ్ సిరీస్ 'తమిళ్ రాకర్స్' ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆ నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, "నేను టీవీ నుంచి వచ్చిన కారణంగా నన్ను ఎంతమంది హీరోలు రిజెక్ట్ చేశారో మీకు తెలుసా?" అని యాంకర్‌ని అడిగింది వాణి. "నేను టీవీ నుంచి వచ్చాననీ, హీరోయిన్‌గా నేనేం చేయగలననీ చాలా మంది హీరోలు అన్నారు. నేను సంతకం చేశాక కూడా, టీవీ నుంచి వచ్చిన కారణంగా వారు నన్ను రిజెక్ట్ చేశారు. అప్పుడు నా గుండె పగిలిపోయినంత పనయ్యేది" అని ఎమోషనల్ అయ్యిందామె.
"అనుకోకుండా 'ఓ మై కడవులే' మూవీలో వచ్చిన మీరా పాత్ర నా కెరీర్‌ను మలుపు తిప్పింది. నాకు పేరు వచ్చాక అదివరకు నన్ను రిజెక్ట్ చేసిన హీరోలలో కొంతమందిని నేను రిజెక్ట్ చేస్తూ వస్తున్నా" అని చెప్పి ఆశ్చర్యపరిచింది వాణి. ప్రస్తుతం ఆమె చేతిలో పది దాకా సినిమాలున్నాయి. వాటిలో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకొని, విడుదలకు సిద్ధమవుతున్నాయి.
![]() |
![]() |