![]() |
![]() |

2022 ఫస్టాఫ్ లో తెలుగునాట అత్యధిక చిత్రాలతో పలకరించిన సంగీత దర్శకుడు.. ఎస్. తమన్. `సూపర్ మచ్చి`, `డీజే టిల్లు` (నేపథ్య సంగీతం), `భీమ్లా నాయక్`, `రాధే శ్యామ్` (నేపథ్య సంగీతం), `గని`, `సర్కారు వారి పాట`.. ఇలా అరడజను సినిమాలతో సందడి చేశాడీ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్.
కట్ చేస్తే.. ఈ క్యాలెండర్ ఇయర్ సెకండాఫ్ లోనూ తన హవానే కనిపించనుంది. ద్వితీయార్ధంలో నాలుగు ఆసక్తికరమైన సినిమాలతో ఎంటర్టైన్ చేయనున్నాడు తమన్. ఆ వివరాల్లోకి వెళితే.. యువ సామ్రాట్ నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కె. కుమార్ రూపొందించిన `థాంక్ యూ` జూలై 22న విడుదల కానుండగా.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో మోహన్ రాజా తెరకెక్కిస్తున్న `గాడ్ ఫాదర్` విజయ దశమి కానుకగా సెప్టెంబర్ చివరలో వినోదాలు పంచనుంది. ఇక శివ కార్తికేయన్ తో అనుదీప్ తీస్తున్న బైలింగ్వల్ మూవీ `ప్రిన్స్` దీపావళి కానుకగా అక్టోబర్ లో తెరపైకి రానుండగా.. నటసింహం నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ మలినేని రూపొందిస్తున్న పేరు నిర్ణయించని సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుందని సమాచారం. మరి.. సెకండాఫ్ లోనూ హవా చాటనున్న తమన్.. వీటిలో ఏయే చిత్రాలతో విజయాలను అందుకుంటాడో చూడాలి.
![]() |
![]() |