![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్ లో 154వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ సినిమాలో రవితేజ నటిస్తున్నాడనేది అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ లో రవితేజ పాల్గొన్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి అంటే రవితేజకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకేనేమో ఇప్పుడు చిరంజీవి సినిమాలో కీ రోల్ లో నటించడానికి కూడా ఓకే చెప్పాడు. గతంలోనూ మెగాస్టార్ తో రవితేజ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. హీరోగా గుర్తింపు రాకముందు 'అన్నయ్య' సినిమాలో చిరుకి తమ్ముడిగా నటించాడు. అలాగే హీరోగా ఎదిగాక 'శంకర్ దాదా జిందాబాద్'లో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చాడు. అయితే స్టార్ అయ్యాక ఇలా కీలక పాత్రలో నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ప్రస్తుతం 'మెగా 154'కి సంబంధించి కీలక షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా, ఈరోజు రవితేజ పాల్గొన్నట్లు మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ షెడ్యూల్ లో చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ సినిమాకే మేజర్ హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.
![]() |
![]() |