వరుసగా మూడు వారాల పాటు ఒకే సంగీత దర్శకుడి సినిమాలు విడుదల కావడం అరుదైన ముచ్చటే. యువ సంగీత దర్శకులు సురేశ్ బొబ్బిలి, కాల భైరవ ఇద్దరు కూడా ముచ్చటగా మూడు వారాల్లో తమ స్వరాలతో సందడి చేస్తుండడం వార్తల్లో నిలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
జూన్ 17న సురేశ్ బొబ్బిలి సంగీతమందించిన `విరాట పర్వం` విడుదలైంది. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ లవ్ స్టోరి.. స్వరకర్తగా సురేశ్ కి మంచి పేరు తీసుకువచ్చింది. ఆపై వారం తరువాత అంటే జూన్ 24న `చోర్ బజార్`తో పలకరించాడు సురేశ్. కట్ చేస్తే.. మరో వారం అనంతరం అంటే జూలై 1న `టెన్త్ క్లాస్ డైరీస్`తో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
ఇక కాల భైరవ విషయానికి వస్తే.. జూలై 8న తను స్వరాలు సమకూర్చిన `హ్యాపీ బర్త్ డే` విడుదల కానుంది. ఆపై వారం తరువాత అంటే జూలై 15న భైరవ బాణీలు కట్టిన `గుర్తుందా శీతాకాలం` తెరపైకి రాబోతోంది. అంతేకాదు.. మరో వారం రోజుల అనంతరం అంటే జూలై 22న `కార్తికేయ 2`తో సందడి చేయనున్నాడు కాల భైరవ. మొత్తమ్మీద.. వరుసగా మూడు వారాల పాటు ఇద్దరు యువ సంగీత దర్శకులు పలకరించడం టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతోంది.