Home  »  News  »  నాకు టి.కృష్ణ పెద్దన్నయ్య.. రావు గోపాలరావు చిన్న మావయ్య

Updated : Jun 27, 2022

గోపీచంద్, రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'పక్కా కమర్షియల్'. సత్యరాజ్, రావు రమేష్, అనసూయ, అజయ్ ఘోష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ జులై 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్లాష్ బ్యాక్ కెళ్ళి టి.కృష్ణ, రావు గోపాలరావుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

"గోపీచంద్ నాన్నగారు టి.కృష్ణ అద్భుతమైన దర్శకులు. ఒంగోలు సీఎస్ఆర్ శర్మ కాలేజ్ లో ఆయన బి.కామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. కాలేజ్ లో చేరిన కొత్తలో ఒకసారి నన్ను పిలిస్తే ఆయన దగ్గరకు బిక్కుబిక్కుమంటూ వెళ్ళాను. స్టూడెంట్ ఫెడరేషన్ లో లీడర్ గా నిలబడుతున్నాను, నీ సపోర్ట్ కావాలన్నారు. అలాగే ఇక్కడ ఎలాంటి సహకారం కావాలన్నా మా సపోర్ట్ ఉంటుందని ఆయన నాకు బిగ్ బ్రదర్ లా భరోసా ఇచ్చారు. ఆయన ఎప్పుడూ నాకు హీరోలా కనిపించేవారు. ఆ తర్వాత ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి అద్భుతమైన సినిమాలు తెరకెక్కించి తక్కువ సమయంలో గొప్ప పేరు సంపాదించారు. ఆయనను దూరం చేసి భగవంతుడు మనకు అన్యాయం చేశాడు. ఆయనకు సినిమా మీద ఉన్న ప్రేమ, అభిమానం ఇప్పుడు గోపీచంద్ ద్వారా కొనసాగుతుండటం ఆనందంగా ఉంది. విలక్షణ పాత్రలతో కెరీర్ ప్రారంభించిన గోపీచంద్ పక్కా కమర్షియల్ హీరోగా ఎదిగాడు. గోపీచంద్ అన్ని సినిమాలు చూస్తుంటాను. 'సాహసం', 'ఒక్కడున్నాడు' వంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. మనిషి చూడటానికి కత్తిలా ఉండటమే కాకుండా పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా చేస్తాడు. గోపీచంద్ కి నార్త్ బెల్ట్ లోనూ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు" అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

"రావు రమేష్, నేను కలిసి సినిమాలు చేయలేదు. బయట కూడా మేం పెద్దగా కలవలేదు. కానీ వాళ్ళ నాన్న గారు రావు గోపాలరావు గారు నాకు చిన్న మావయ్య అవుతారు. రామలింగయ్య గారిని ఆయన అన్నయ్య అని పిలిస్తే.. నేను ఆయనను ఎప్పుడూ మావయ్య గారు, చిన్న మావయ్య గారు అని పిలుస్తూ ఉండేవాడిని. నేనంటే ఆయనకు చాలా ప్రేమ. రావు రమేష్ అమ్మగారు చేసిన వంటలను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి నా చేత తినిపించేవారు. వంకాయ కూర తినకపోతే.. మీ అత్తయ్య చిరంజీవి బాబుకి తినిపించమని ప్రేమతో పంపించారు. అసలు ఆ వంకాయ చూడు శ్రీదేవి బుగ్గల్లా కనిపించట్లా మీకు.. మాకంటే వయస్సు అయిపొయింది, మీ కుర్రాళ్ళు బాగా తినాలయ్యా అని చెప్పేవాళ్ళు. లంచ్ టైంలో అంత ఆప్యాయంగా తినిపించేవారు. అప్పుడు రావు రమేష్ చిన్న పిల్లాడు. వాళ్ళ నాన్న గారి ఇన్స్పిరేషన్ తో సినిమాల్లోకి వచ్చిన రావు రమేష్.. విభిన్న పాత్రలు చేస్తూ, అందరి మన్ననలు పొందుతున్నాడు. రావు గోపాలరావు గారు లేని లోటుని భర్తీ చేస్తూ, ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను." అని మెగాస్టార్ అన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.