![]() |
![]() |

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'విరాట పర్వం'. టీజర్, 'కోలు కోలు' సాంగ్ తో ఆకట్టుకున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు నేడు విడుదల తేదీని ప్రకటించారు. జూలై 1 న ఈ మూవీ థియేటర్స్ లో విడుదల కానుంది.
'నీది నాది ఒకే కథ' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత తన తదుపరి సినిమాని విభిన్న చిత్రాలు చేసే రానా, సాయి పల్లవితో ప్రకటించగానే 'విరాట పర్వం'పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్లే ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూశారంతా. కానీ ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఒకానొక సమయంలో ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుందని ప్రచారం జరిగింది. అయితే మూవీ టీమ్ ఆ వార్తలను ఖండించింది. తర్వాత నెలలు గడిచిపోయాయి, సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇక ఆడియన్స్ ఈ సినిమా ఇప్పట్లో వస్తుందా అనుకుంటున్న టైంలో రిలీజ్ డేట్ ప్రకటించి సర్ ప్రైజ్ చేసింది మూవీ టీమ్. జూలై 1 న విడుదల చేస్తున్నట్లు తాజాగా పోస్టర్ ని రిలీజ్ చేశారు. అందులో రానా ఒక చేత్తో గన్ పట్టుకొని కాలుస్తూ.. మరో చేత్తో సాయి పల్లవి చేతిని అందుకొని పరుగెత్తుతున్నట్లుగా ఉంది.

ఈ సందర్భంగా "ఆలస్యంగా వస్తున్నా.. క్లాసిక్ మూవీని ఇస్తున్నాం" అంటూ రానా ట్వీట్ చేశాడు. "తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం. మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్భం. ప్రేమ యుద్ధమై సాగిన విరాటపర్వం. జులై ఒకటవ తేదీన మీ ముందుకు" అంటూ డైరెక్టర్ వేణు ట్వీట్ లో కూడా తన కలం బలం చూపించాడు.
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
![]() |
![]() |