![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో పలు రీమేక్ సెన్సేషన్స్ ఉన్నాయి. వాటిలో `ఖుషి` ఒకటి. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ `ఖుషి` (విజయ్, జ్యోతిక)కి రీమేక్ గా మాతృక దర్శకుడు ఎస్. జె. సూర్య తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్.. ఒరిజినల్ కి మించి ఎంటర్ టైన్ చేసి తెలుగునాట `వన్ ఆఫ్ ది బెస్ట్ రీమేక్స్` జాబితాలో చేరింది. `ఈగో`ల చుట్టూ తిరిగే ఈ ప్రేమకథా చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జంటగా భూమిక నటించగా ముంతాజ్, సుధాకర్, నాజర్, రాజన్ పి. దేవ్, శివాజీ, విజయ్ కుమార్, సుధ, అలీ, అజయ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. చిత్ర దర్శకుడు ఎస్.జె. సూర్య అతిథి పాత్రలో మెరిశారు. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం, రాజేంద్ర కుమార్ సంభాషణలు `ఖుషి`కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మెలోడీబ్రహ్మ మణిశర్మ బాణీలు, నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచిన `ఖుషి`లో.. ``అమ్మాయే సన్నగా``, `ఆడవారి మాటలకు అర్థాలే వేరులే`` (రీమిక్స్), ``చెలియ చెలియా``, `ప్రేమంటే సులువు కాదురా``, ``హోళీ హోళీ``, ``యే మేరా జహా``.. ఇలా ప్రతీ పాట అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించింది. శ్రీ సూర్య మూవీస్ పతాకంపై ఎ.ఎం. రత్నం నిర్మించిన `ఖుషి`.. 2001 ఏప్రిల్ 27న విడుదలై సంచలన విజయం సాధించింది. నేటితో ఈ మ్యూజికల్ సెన్సేషన్ 21 వసంతాలను పూర్తిచేసుకుంది.
![]() |
![]() |