![]() |
![]() |

యశ్ హీరోగా నటించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' బాక్సాఫీస్‌ను తుఫాన్‌లా చుట్టేస్తోంది. దాని పాన్ ఇండియా సక్సెస్ దెబ్బకు పలు రికార్డులు తెరమరుగవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కేజీఎఫ్ క్రేజ్ మరింత కాలం కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోన్న ఆ సినిమా అటు హిందీతో పాటు, ఇటు ప్రాంతీయ మార్కెట్ దగ్గర కూడా ఒకదాని తర్వాత ఒకటిగా సరికొత్త రికార్డులను సాధిస్తూ దూసుకుపోతోంది.
ఇప్పుడు 'కేజీఎఫ్ 2' తమిళనాట ఒక స్టార్ హీరో నటించిన తమిళ సినిమాతో పాటు రిలీజై, దాన్ని ఓడించిన తొలి కన్నడ సినిమాగా చరిత్రకెక్కింది. ఈ విషయాన్ని ట్రేడ్ విశ్లేషకుడు మనోబాల విజయబాలన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. "తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ అయ్యింది. 9 రోజుల్లో రూ. 61.17 కోట్లను వసూలు చేసిన 'బీస్ట్' మూవీని ఎనిమిది రోజుల్లో రూ. 64.04 కోట్లను సాధించడం ద్వారా 'కేజీఎఫ్ చాప్టర్ 2' ఓడించింది. తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర ఒక తమిళ మూవీతో పాటు విడుదలైన ఓ కన్నడ సినిమా దాన్ని ఓడించడం ఇదే తొలిసారి." అని ఆయన రాసుకొచ్చాడు.
విజయ్ హీరోగా నటించిన 'బీస్ట్' మూవీని నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో 'రా' మాజీ ఏజెంట్‌గా విజయ్ నటించగా, అతని ప్రియురాలిగా పూజా హెగ్డే కనిపించింది. మరోవైపు రాకీ భాయ్‌గా యశ్ నటించిన 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను ప్రశాంత్ నీల్ రూపొందించాడు. ప్రస్తుతం అతను ప్రభాస్‌తో 'సలార్' మూవీని తీసే పనిలో ఉన్నాడు.
![]() |
![]() |