![]() |
![]() |

మ్యూజికల్ హిట్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నిర్మాణ సంస్థల్లో `యువచిత్ర` ఒకటి. ఈ సంస్థ నిర్మించిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ లో `సీతారామ కళ్యాణం`(1986)కి ప్రత్యేక స్థానం ఉంది. నటసింహం నందమూరి బాలకృష్ణతో `యువచిత్ర` తొలిసారిగా నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామాని `హాస్యబ్రహ్మ` జంధ్యాల తెరకెక్కించారు. బాలయ్యకి జోడీగా రజని నటించిన ఈ సినిమాలో జగ్గయ్య, గొల్లపూడి మారుతీరావు, రాజేశ్, శ్రీధర్, రామకృష్ణ, సుత్తి వేలు, గిరీశ్, శుభలేఖ సుధాకర్, రమాప్రభ, సంగీత, ముచ్చర్ల అరుణ, కల్పనా రాయ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు.
ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి సుందరరామ్మూర్తి వంటి దిగ్గజ రచయితల కలాల నుంచి జాలు వారిన గీతాలకు స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ బాణీలు కట్టారు. ఇందులోని పాటల్లో ``కళ్యాణ వైభోగమే``, ``రాళ్ళల్లో ఇసుకల్లో`` ఎవర్ గ్రీన్ సాంగ్స్ గా నిలవగా.. ``ఏమని పాడను``, ``సరిగమపదని``, ``ఎంత నేర్చినా``, ``వీళ్ళూ వాళ్ళు`` గీతాలు కూడా రంజింపజేశాయి. 1986 ఏప్రిల్ 18న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన `సీతారామ కళ్యాణం`.. 16 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. నేటితో ఈ చిత్రం 36 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |