![]() |
![]() |

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సెన్సేషనల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో `ఆది`కి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే.. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాతోనే తారక్ స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. టీనేజ్ లోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న యంగ్ హీరోగా అప్పట్లో తెలుగునాట రికార్డులకెక్కారు ఎన్టీఆర్. ఇక ఈ సినిమాతోనే అగ్ర దర్శకుడు వీవీ వినాయక్ తొలిసారిగా మెగాఫోన్ పట్టారు. తారక్ ని పవర్ ఫుల్ రోల్ లో ప్రజెంట్ చేసి మెప్పించారాయన. అలాగే, కాలేజ్ కెళ్ళే కుర్రాడిని ఫ్యాక్షనిస్ట్ గా చూపించడం అనే అంశం అప్పట్లో మాస్ ఆడియన్స్ ని భలేగా ఆకట్టుకుంది.
కీర్తి చావ్లా కథానాయికగా పరిచయమైన ఈ సినిమాలో రాజన్ పి. దేవ్, చలపతి రావు, అలీ, ఆహుతి ప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, ఎమ్మెస్ నారాయణ, వేణు మాధవ్, రాజీవ్ కనకాల, చిత్రం శ్రీను, రఘు కారుమంచి, రఘుబాబు, కరాటే కళ్యాణి, రమ్యశ్రీ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతం `ఆది`కి ఎస్సెట్ గా నిలిచాయి. ``నీ నవ్వుల తెల్లదనాన్ని``, ``తొలి వలపే``, ``పట్టు ఒకటోసారి``, ``చికిచికి``, ``అయ్యో రామ ఆంజనేయ``, ``సున్నుండ``.. ఇలా ఇందులోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. బెల్లంకొండ సురేశ్ నిర్మించిన `ఆది`.. 96 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడమే కాకుండా `ఉత్తమ నూతన దర్శకుడు`, `ఉత్తమ గీత రచయిత` (చంద్రబోస్), `ఉత్తమ ఎడిటర్` (గౌతం రాజు), `స్పెషల్ జ్యూరీ` (ఎన్టీఆర్) విభాగాల్లో `నంది` పురస్కారాలను అందుకుంది. 2002 మార్చి 28న విడుదలై సంచలన విజయం సాధించిన `ఆది`.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |