![]() |
![]() |

సీనియర్ సూపర్‌స్టార్ కృష్ణ ఇప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. రెండో భార్య విజయనిర్మల రెండేళ్ల క్రితం మృతి చెందాక, కొంత కాలం ఆ బాధలో ఉండిపోయిన ఆయన, ఆ తర్వాత తేరుకొని, తన కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు, మనవరాళ్లతో కాలం గడుపుతూ వస్తున్నారు. అయితే అంతలోనే ఆయనకు మరో దెబ్బ తగిలింది. పెద్ద కుమారుడు రమేశ్‌బాబు అనారోగ్యంతో ఈ ఏడాది జనవరి 8న మృతి చెందారు. దీంతో కృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఎలాంటి గాయాన్నైనా కాలం మాన్పుతుందంటారు. రోజులు గడుస్తున్నకొద్దీ పెద్ద కొడుకు చనిపోయిన బాధ నుంచి క్రమంగా కోలుకుంటూ వచ్చిన కృష్ణ, మళ్లీ మిగతా కుటుంబ సభ్యులతో కలిసి గడపడం మొదలుపెట్టారు. అలా చిన్నకూతురు ప్రియదర్శిని (హీరో సుధీర్‌బాబు భార్య)తో ఆనందంగా మాట్లాడుతున్న క్షణాలను కెమెరాతో బంధించి, తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు కృష్ణ రెండో కుమార్తె మంజుల. ఏదో ఫంక్షన్‌లో రౌండ్ టేబుల్ దగ్గర ప్రియదర్శినితో కూర్చొని కెమెరాకు నవ్వుతూ పోజిచ్చారు సూపర్‌స్టార్. ఆ ఫొటోకు "మా కుటుంబంలో బుల్లి (ప్రియదర్శిని) అందరికంటే చిన్నది. అందరికంటే నాన్న ఎక్కువగా ముద్దుచేసేది తననే" అంటూ క్యాప్షన్ పెట్టారు మంజుల.
తెలుగు చిత్రసీమలోని పెద్ద కుటుంబాల్లో ఘట్టమనేని కుటుంబం ఒకటి. కృష్ణ తర్వాత ఆయన వారసునిగా ఎదిగిన మహేశ్‌బాబు ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్‌లో ఒకడిగా రాణిస్తున్నాడు. మంజుల నటి, నిర్మాత, దర్శకురాలు కాగా ఆమె భర్త సంజయ్ స్వరూప్ నటుడు. ఇటీవల 'భీమ్లా నాయక్'లో ఆయన ఎస్పీగా కనిపించారు. కృష్ణ చిన్నల్లుడు సుధీర్‌బాబు కూడా మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
![]() |
![]() |