![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'గాడ్ ఫాదర్'. మలయాళ సూపర్ హిట్ మూవీ 'లూసిఫర్'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది.
హైదరాబాద్ లో జరుగుతున్న 'గాడ్ ఫాదర్' షూటింగ్ లో నయనతార కొద్దిరోజులుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయిందని మూవీ టీమ్ తెలిపింది. హైదరాబాద్ లో లేడీ సూపర్ స్టార్ తో జరిగిన గాడ్ ఫాదర్ కీలక షెడ్యూల్ ముగిసిందని తెలుపుతూ.. లొకేషన్ లో డైరెక్టర్ తో కలిసి నయనతార దిగిన ఫోటోని మూవీ టీమ్ పంచుకుంది. అలాగే, 'గాడ్ ఫాదర్' కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే రానున్నాయని పేర్కొంది. మరోవైపు డైరెక్టర్ మోహన్ రాజా.. నయనతారతో వరుసగా మూడో సినిమా చేయడం సంతోషంగా ఉందని తెలిపాడు.
ఎన్వీఆర్ సినిమా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
కాగా, చిరంజీవి త్వరలో 'ఆచార్య' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |