![]() |
![]() |

చిరంజీవి ఆధ్వర్యంలోని టాలీవుడ్ ప్రముఖుల బృందం గురువారం ఏపీ వైఎస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి మంచు ఫ్యామిలీ హాజరు కాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా ఊహించని విధంగా ఏపీ మంత్రి పేర్ని నాని హైదరాబాద్ లో మంచు ఫ్యామిలీతో భేటీ అయ్యి సంచలనం లేపారు.
మోహన్ బాబు సీనియర్ నటుడు, నిర్మాత. ఆయన కుమారుడు మంచు విష్ణు నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. అంతేకాదు, మంచు ఫ్యామిలీ సీఎం జగన్ కి సమీప బంధువులు, వైసీపీ మద్దతు దారులు. ఇన్ని అర్హతలు ఉన్నా గురువారం జరిగిన సీఎం భేటీలో మంచు కుటుంబం కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. వైసీపీ మద్దతు దారులుగా పేరున్న పోసాని, ఆలీ కూడా ఆ భేటీలో కనిపించారు. దీంతో మంచు ఫ్యామిలీ కనిపించకపోవడంపై రకరకాల చర్చలు జరిగాయి. మోహన్ బాబుకి ఆహ్వానం అందలేదా? మంచు ఫ్యామిలీని జగన్ పక్కన పెట్టేశారా? చిరంజీవిని సినీపెద్దగా ప్రొజెక్ట్ చేస్తూ జరిగిన ఈ భేటీకి రావడం ఇష్టం లేక మోహన్ బాబే దూరంగా ఉన్నారా? ఇలా రకరకాలు చర్చలు జరిగాయి. అయితే తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి తమ ప్రభుత్వం మంచు ఫ్యామిలీని పక్కన పెట్టలేదనే సందేశాన్ని పరోక్షంగా ఇచ్చారు. తమ దృష్టిలో మోహన్ బాబే అసలుసిసలు పెదరాయుడు అనుకునేలా చేశారు.
మోహన్‌బాబుతో శుక్రవారం నాడు మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. ఈ భేటీలో మంచు విష్ణు కూడా పాల్గొన్నారు. గురువారం చిరంజీవి బృందంతో సీఎం జగన్ భేటీకి సంబంధించిన వివరాలను మోహన్ బాబుకు పేర్ని నాని వివరించినట్టు తెలుస్తోంది. టికెట్ ధరలతో పాటు పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. చిరంజీవి బృందం సినీ పరిశ్రమ సమస్యల గురించి చర్చించడానికి అమరావతికి పయనమైతే.. మంత్రి పేర్ని నాని మాత్రం స్వయంగా హైదరాబాద్ లోని మోహన్ బాబు నివాసానికి వెళ్లి భేటీ అవ్వడం ప్రాధాన్యత సంచరించుకుంది.
![]() |
![]() |