![]() |
![]() |

మెగా కాంపౌండ్ కి, మైత్రీ మూవీ మేకర్స్ కి మంచి అనుబంధమే ఉంది. మైత్రీ సంస్థలో ఇప్పటివరకు విడుదలైన `మెగా` క్యాంప్ సినిమాలన్నీ కమర్షియల్ గా వర్కవుట్ అయ్యాయి. తొలుత ఈ కాంపౌండ్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో మైత్రీ నిర్మించిన `రంగస్థలం`.. చరణ్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఆపై వరుస పరాజయాల్లో ఉన్న `సుప్రీమ్` హీరో సాయితేజ్ కి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన `చిత్రలహరి` మళ్ళీ సక్సెస్ అందించింది.
అలాగే సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ఇదే సంస్థ నిర్మించిన `ఉప్పెన` సంచలన విజయం సాధించి.. వైష్ణవ్ కి డ్రీమ్ డెబ్యూ మూవీగా నిలిచింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఈ బేనర్ నుంచి వస్తున్న తాజా చిత్రం `పుష్ప - ద రైజ్` కూడా ఆ క్యాంప్ కి చెందిన స్టార్ తో తీసిన సినిమానే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రేపు (డిసెంబర్ 17) థియేటర్స్ లోకి రాబోతోంది. మరి.. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో హ్యాట్రిక్ విజయాలు చూసిన మైత్రీ సంస్థ.. `పుష్ప - ద రైజ్`తోనూ ఆ పరంపరని కొనసాగిస్తుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం మైత్రీ సంస్థలో సినిమాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ కి మెమరబుల్ హిట్స్ అందిస్తాయేమో చూడాలి.
![]() |
![]() |