![]() |
![]() |

నిన్న తీవ్ర అస్వస్థతకు గురై అపోలో హాస్పిటల్‌లో చికిత్స నిమిత్తం చేరిన లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ ఆరోగ్య స్థితి ఈరోజు కాస్త కుదుటపడినట్లు సమాచారం. నిన్న సాయంత్రం ఆయన సెప్టిక్ షాక్‌లో ఉన్నారనీ, పలు అవయవాలు చికిత్సకు స్పందించడం లేదనీ హెల్త్ బులెటిన్‌లో డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్ మీద ఉన్న ఆయన ఈరోజు స్పృహలోకి వచ్చారు. ఈ సమాచారం తెలియగానే చిరంజీవి ఆయనకు ఫోన్ చేసి పలకరించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చిరంజీవి వెల్లడించారు.
దీనికి సంబంధించి ఒక నోట్‌ను ఆయన షేర్ చేశారు. "ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీ కైకాల సత్యనారాయణ గారు స్పృహలోకి వచ్చారని తెలియగానే ఆయన్ని ట్రీట్ చేస్తోన్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి గారి సహాయంతో ఆయన్ని ఫోన్‌లో పలకరించాను. ఆయన త్వరగా కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, మళ్లీ త్వరలో ఇంటికి రావాలని, ఆ సందర్భాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్ అప్ సైగచేసి, థాంక్ యూ అని చూపించినట్లుగా డాక్టర్ సుబ్బారెడ్డి గారు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితోనూ ఈ విషయం పంచుకోవడం చాలా సంతోషంగా వుంది" అని ఆయన ఆ నోట్‌లో రాసుకొచ్చారు.

చిరంజీవి, సత్యనారాయణ మధ్య ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి అంటే సత్యనారాయణకు ఎంతో అభిమానం. అలాగే సత్యనారాయణ అన్నా చిరంజీవికి ఎంతో గౌరవం, అభిమానం.
![]() |
![]() |