![]() |
![]() |

సుకుమార్ మంచి దర్శకుడు మాత్రమే కాదు.. మంచి రచయిత, అభిరుచి ఉన్న నిర్మాత కూడా. అలాంటి సుక్కు.. తన రచన, నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కించిన యూత్ ఫుల్ రొమాంటిక్ డ్రామా `కుమారి 21 F`. ఇందులో కుమారిగా టైటిల్ రోల్ లో హెబా పటేల్ ఎంటర్టైన్ చేయగా.. ఆమెని ప్రేమించే యువకుడు సిద్ధుగా రాజ్ తరుణ్ అలరించాడు. `ఉయ్యాలా జంపాలా`, `సినిమా చూపిస్త మావ` వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తరువాత రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన `కుమారి 21 F`.. అతని కెరీర్ లో హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. నోయల్, హేమ, నవీన్ నేని, సుదర్శన్, భాను శ్రీ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు, నేపథ్య సంగీతం `కుమారి 21 F`కి ప్రధాన బలంగా నిలిచాయి. పాటల్లో ``లవ్ చేయాలా వద్దా`` చార్ట్ బస్టర్ గా నిలవగా.. ``మేఘాలు లేకున్నా``, ``బేబీ యూ గోన్నా మిస్ యూ``, ``బ్రేకప్ ప్యాచప్``, ``బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంకాక్`` గీతాలు కూడా రంజింపజేశాయి. కన్నడంలో `కుమారి 21 F` పేరుతోనే ఈ సినిమా రీమేక్ అయింది. 2015 నవంబర్ 20న విడుదలై యువతరాన్ని విశేషంగా అలరించిన `కుమారి 21 F`.. నేటితో ఆరు వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |