![]() |
![]() |

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు సంపూ గత చిత్రాల తరహాలోనే 'మిస్టర్ బెగ్గర్' అనే విభిన్న టైటిల్ ను పెట్టారు. కార్తీక్ మూవీ మేకర్స్ పతాకంపై గురురాజ్, కార్తీక్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వడ్ల జనార్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో సంపూ సరసన అద్వితి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
'మిస్టర్ బెగ్గర్' చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సోమవారం ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు సత్య ప్రకాష్ క్లాప్ కొట్టగా.. ప్రముఖ దర్శకుడు వి. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ.. "దర్శకుడు జనార్థన్ గారు అద్భుతమైన స్క్రిప్ట్ తో ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చాలా వరకు గోవా బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. వచ్చే నెలలో గోవా షెడ్యూల్ ప్లాన్ చేశాం. `హృదయ కాలేయం` చిత్రం నుంచి నన్ను ఇప్పటి వరకూ ఆదరిస్తూ వచ్చారు. ఈ సినిమాను కూడా అదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఎన్నో పెద్ద చిత్రాల్లో నటించిన సత్యప్రకాష్ గారితో నటించడం చాలా హ్యాపీ. ఇంకా చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్స్ మా సినిమాలో నటిస్తున్నారు" అన్నారు.
దర్శకుడు వడ్ల జనార్థన్ మాట్లాడుతూ.. "మిస్టర్ బెగ్గర్ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సరదా సరదాగా సాగే కుటుంబ కథా చిత్రానికి మంచి వినోదం పొందు పరిచాము. సంపూ గారి మేనరిజానికి తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ చేశాం. బాంబే, చెన్నై, గోవాల్లో సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ ప్లాన్ చేశాం" అన్నారు.
నటుడు సత్య ప్రకాష్ మాట్లాడుతూ.. "ఈ చిత్రంలో నేను మెయిన్ విలన్ గా నటిస్తున్నా. యువ నిర్మాతలు, యువ టెక్నీషియన్స్ పని చేస్తోన్న ఈ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది" అన్నారు.
ఈ సినిమాకి కథ, మాటలు పోలూరి ఘటికాచలం అందించారు. పీఆర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అలీ, బాబు మోహన్, పృథ్వీ, రఘుబాబు, రచ్చ తదితరులు నటిస్తున్నారు.
![]() |
![]() |