![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల సందర్భంగా జరిగిన రచ్చను, రసాభాసను మర్చిపోకముందే.. నవంబర్ 14న జరగనున్న 'తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం' ఎన్నికల వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న కె.వి.ఆర్ చౌదరి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ తమ నామినేషన్స్ ను తిరస్కరించారని ఆరోపిస్తూ ఇద్దరు కోర్టుని ఆశ్రయించారు. తాజాగా వారికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది.
తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న కె.వి.ఆర్ చౌదరి ఇద్దరు సభ్యుల నామినేషన్స్‌ను తిరస్కరించడం వివాదానికి దారి తీసింది. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టు, దర్శకుడు ప్రభు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నకారణంగా చలనచిత్ర దర్శకుల సంఘంలో పోటీ చేయడానికి వీలులేదు అంటూ ఆయన నామినేషన్ ను తిరస్కరించడం చర్చనీయాంశమైంది. అసలు అలాంటి నిబంధన ఏదీ అసోసియేషన్ బైలాస్ లో లేకపోయినప్పటికీ ఎన్నికల అధికారి కొందరు వ్యక్తుల వత్తిడికి తలొగ్గి ఉద్దేశ్యపూర్వకంగానే తన నామినేషన్ ను తిరస్కరించారని ప్రభు ఆరోపించారు. అలాగే మరొక సీనియర్ దర్శకుడు మద్దినేని రమేష్ అభ్యర్థిత్వాన్ని కూడా తిరస్కరించడం జరిగింది. తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడం వెనుక కొందరు సినీ పెద్దల హస్తం ఉందని, మినిట్స్ బుక్‌లోని రిసొల్యుషన్స్ ను తారుమారు చేసి అక్రమాలకు పాల్పడిన గత కమిటీకి.. రిటర్నింగ్ ఆఫీసర్ చౌదరి కొమ్ముకాస్తున్నారని మద్దినేని రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు ఈ విషయంలో వీరిద్దరూ కోర్టుని ఆశ్రయించారు.
కోర్టును ఆశ్రయించిన జర్నలిస్టు ప్రభు, మద్దినేని రమేష్ లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ప్రభు వేసిన రిట్ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ప్రభు అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఆయన నామినేషన్ ను అనుమతించింది. అలాగే మద్దినేని రమేష్ కు కూడా కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుతో వీరిద్దరూ నవంబర్ 14న జరగనున్న 'తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం' ఎన్నికల బరిలో ఉన్నట్లే.
![]() |
![]() |