![]() |
![]() |

'కోతిమూక' ఫేమ్ శ్రద్ధా ఆర్య రీల్ లైఫ్ రియాలిటీగా మారుతున్నట్లుగా ఉంది. 'కుండలీ భాగ్య' (హిందీ) సీరియల్‌లో అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న ఆమె, నిజ జీవితంలోనూ దాన్నే ఎంచుకోవడం గమనార్హం. సాధారణంగా తారలు ప్రేమ వివాహాన్నే ఎంచుకుంటూ రావడం చూస్తుంటాం. కానీ శ్రద్ధ మాత్రం పెద్దలు చూసిన సంబంధానికి ఓకే చెప్పింది. ఢిల్లీకి చెందిన రాహుల్ శర్మ అనే అతన్ని ఢిల్లీలో వివాహం చేసుకోబోతోంది. వరుడు రాహుల్ నేవీలో పనిచేస్తున్నాడు. అతని ఫ్యామిలీ, శ్రద్ధ ఫ్యామిలీ బాగా సన్నిహితం.
ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న అందాజ్ హోటల్‌లో నవంబర్ 16 రాత్రి 7 గంటలకు పెళ్లి వేడుక జరుగుతుందని సమాచారం. నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలని వధూవరులిద్దరూ కోరుకోవడంతో కటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు.
ఎస్.జె. సూర్య సరసన నయనతారతో పాటు కలిసి నటించిన తమిళ చిత్రం 'కల్వినిన్ కాదలి' (2006) సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన శ్రద్ధ.. తెలుగులో ఎ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన 'గొడవ' మూవీలో తొలిసారిగా నటించింది. ఆ సినిమాతో కోదండరామిరెడ్డి తనయుడు వైభవ్ హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఏవీఎస్ దర్శకత్వంలో కృష్ణుడు సరసన 'కోతిమూక'లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకుంది.
అయితే సినిమాల్లో ఆశించిన మేర అవకాశాలు రాకపోవడంతో హిందీ టీవీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ మంచి ఆదరణ లభించడంతో, టీవీ సీరియల్స్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె మెయిన్ రోల్ చేస్తున్న 'కుండలీ భాగ్య' సీరియల్ 2017 నుంచి ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది.
![]() |
![]() |