![]() |
![]() |

'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మంచు విష్ణు సైలెంట్ గా 'మా'లో తనకు నచ్చినది చేసుకుంటూ వెళ్తున్నారా? అంటే.. కొన్ని పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసి గెలిచిన 11 మంది స్థానంలో.. విష్ణు తన ప్యానల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిని తీసుకున్నారని తెలుస్తోంది.
మా ఎన్నికలు జరిగిన తీరుపై అసహనం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ప్యానల్.. ఎన్నికలు ముగిశాక ఆ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది మూకుమ్మడి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఒకే ప్యానల్ కి చెందిన వారంతా అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకాష్ రాజ్ ప్యానల్ తెలిపింది. అయితే ఆ సమయంలో ఈ రాజీనామాల అంశంపై స్పందించిన విష్ణు.. రాజీనామా లేఖలు తన వద్దకు రాలేదని, వచ్చాక దీనిపై స్పందిస్తానని అన్నారు. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే విష్ణు 'మా'లో గోప్యంగా నియామకాలు చేసి సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నారని అర్థమవుతోంది.

'మా' కోసం 'మా తెలుగు' పేరుతో ఇటీవల అఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ని స్టార్ట్ చేసిన విష్ణు టీమ్.. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోలో విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేసి ఓడిపోయినవారు కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్ సహా మొత్తం 11 మంది గెలిచారు. అయితే ఇప్పుడు వారి స్థానంలో విష్ణు ప్యానల్ నుంచి ఓడిపోయిన బాబూమోహన్, కరాటే కళ్యాణితో పాటు మిగతా తొమ్మిది మంది పేర్లు కనిపిస్తున్నాయి.
మంచు విష్ణు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన వారి రాజీనామా లేఖలు విష్ణుకి చేరాయా? వాటిని ఆయన ఆమోదించారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆమోదిస్తే.. వారి స్థానంలో తన ప్యానల్ నుంచి ఓడిపోయిన వారిని తీసుకున్నట్లు ఎందుకు గోప్యంగా ఉంచారు?. 'మా'ని పూర్తిగా తన ప్యానల్ తో పాలించాలని నిర్ణయించుకున్న విష్ణు మరి ఆ విషయాన్ని అధికారికంగా ఎందుకు ప్రకటించలేదు?. ఏది ఏమైనా విష్ణు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో వివాదాల మధ్య మా ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విష్ణు.. ఈ వివాదంపై ఎలా స్పందిస్తారో చూడాలి.
![]() |
![]() |