![]() |
![]() |

బాలకృష్ణ కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో ఉంటున్నారు. ఒకవైపు 'అఖండ' మూవీ అప్‌డేట్స్, ఇంకోవైపు 'ఆహా' ఓటీటీలో స్టార్టయిన 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' టాక్ షోతో బాలయ్య అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. నటుడిగా, రాజకీయవేత్తగా ఇప్పటికే తనేమిటో ప్రూవ్ చేసుకున్న ఆయన హోస్ట్‌గానూ చెలరేగిపోతున్నారు. అసలు బాలయ్యలో ఈ తరహా కోణం ఉంటుందని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని రీతిలో హోస్ట్‌గా దర్శనమిచ్చి అలరించారు. ఆహాలో ప్రసారమైన 'అన్‌స్టాపబుల్' తొలి ఎపిసోడ్‌లో మోహన్‌బాబును ఆయన ఇంటర్వ్యూ చేసిన విధానం, ఆయన సమయస్ఫూర్తి ప్రశ్నలు, ఆయన ఎనర్జీ ఆడియెన్స్‌ను ఫిదా చేశాయి. ఆ ఎపిసోడ్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.
ఈ టాక్ షో రెండో ఎపిసోడ్ శుక్రవారం స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్‌లో సెల్ఫ్‌మేడ్ స్టార్ నానితో బాలయ్య సంభాషణను మనం చూడబోతున్నాం. 'కృష్ణగాడి వీరప్రేమగాథ'లో బాలయ్య వీరాభిమానిగా నాని నటించిన విషయం తెలిసిందే. కాగా ఇదే ఎపిసోడ్‌లో నటి పూర్ణతో కలిసి బాలయ్య డాన్స్ పర్ఫార్మెన్స్‌ను కూడా మనం చూడబోతున్నామని ఆహా రిలీజ్ చేసిన ప్రోమో తెలియజేసింది.
'సమరసింహారెడ్డి' సినిమాలోని "నందమూరి నాయకా అందమైన కానుకా ముందరుంది చూసుకోరా".. పాటకు బాలయ్య, పూర్ణ స్టెప్పులేశారు. ఆ పాటలో వచ్చే "జింగిలాల జింగిలాల జింగిలాలో" లైన్‌కు బాలయ్య ఎనర్జిటిక్ మూవ్‌మెంట్స్ సూపర్బ్ అనిపించాయి. పూర్ణతో ఆయన కెమిస్ట్రీ కూడా బాగుంది. షష్టి పూర్తయిన బాలకృష్ణలో ఎనర్జీ లెవల్స్ ఏమాత్రం తగ్గలేదని ఈ పర్ఫార్మెన్స్ చెప్పేసింది.

![]() |
![]() |