![]() |
![]() |

స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో మాస్ మహారాజా రవితేజ నటించడం ఖాయమైంది. ఈ విషయాన్ని అఫిషియల్‌గా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు రవితేజ. వంశీ ('దొంగాట' ఫేమ్ వంశీకృష్ణ) డైరెక్ట్ చేసే ఈ మూవీకి 'టైగర్ నాగేశ్వరరావు' అనే టైటిల్ పెట్టారు. టైటిల్ లోగో పోస్టర్‌ను రవితేజ షేర్ చేశారు. టైటిల్ రోల్ రవితేజ లుక్ ఎలా ఉంటుందనేది మాత్రం చూపలేదు కానీ, ఆయన కాళ్లు ఎలా ఉంటాయో మాత్రం ఆ పోస్టర్‌లో చూపించారు.
ట్రైన్ వెళ్తుండగా, దాని పక్కనుంచి ఆయన నడుస్తున్నట్లు కనిపించింది. రైళ్లలో అనేకసార్లు టైగర్ నాగేశ్వరరావు దొంగతనాలు చేశాడని అన్యాపదేశంగా ఆ పోస్టర్‌తో చెప్తున్నారన్న మాట. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా రిలీజవుతుందని తెలిపారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించే ఈ మూవీకి జి.వి. ప్రకాశ్‌కుమార్ సంగీత దర్శకుడు కాగా, మది సినిమాటోగ్రాఫర్.
ఈ ఏడాది ఆగస్టులోనే రవితేజ ఈ మూవీ చేయనున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. వంశీ చెప్పిన స్క్రిప్టు రవితేజకు బాగా నచ్చిందనీ, దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ వినిపించింది. ఇప్పుడు అధికారికంగానే ఆ ప్రాజెక్టును ప్రకటించారు. పోలీసుల కళ్లుగప్పి అనేక దొంగతనాలను చేసిన గజదొంగగా నాగేశ్వరరావు పేరు పొందాడు. ఆయనకూ విపరీతమైన ఫ్యాన్స్ ఉండేవారు. వారంతా ఆయనను టైగర్ అని అభిమానంగా పిలుచుకొనేవారు.

రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి', 'రామారావ్ ఆన్ ఆన్ డ్యూటీ', 'ధమాకా', సుధీర్ వర్మ డైరెక్షన్‌లో సినిమాలను చేస్తున్నారు. వాటి తర్వాత 71వ సినిమాగా 'టైగర్ నాగేశ్వరరావు' విడుదల కానున్నది. 'క్రాక్' సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుసపెట్టి సినిమాలు ఒప్పుకుంటూ రవితేజ యమ దూకుడు ప్రదర్శిస్తున్నారు.
సందర్భవశాత్తూ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సైతం టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా 'స్టూవర్ట్‌పురం దొంగ' సినిమాను చాలా రోజుల క్రితమే ఎనౌన్స్ చేశారు. దానికి వి.వి. వినాయక్ శిష్యుడు కె.ఎస్. డైరెక్టర్.
![]() |
![]() |