![]() |
![]() |

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ఆకస్మిక మరణం పట్ల అందరూ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. శాండల్ వుడ్ లో పునీత్ ను హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ పూరి జగన్నాధ్ తాజాగా పునీత్ మరణంపై స్పందించారు. పునీత్ మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నట్లుగా తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు.
"పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త విని షాకయ్యాను. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. నాకు పునీత్ చాలా క్లోజ్. తన మొట్టమొదటి సినిమా 'అప్పు' చేశాను నేను. ఆ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. పునీత్ చాలా మంచివాడు. ఎంతోమందిని ఆదుకున్నాడు. ఎంతోమందికి సహాయం చేశాడు. అలాంటి మనిషి దూరం కావడం నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాను. రాజ్ కుమార్ గారు లేరు. పార్వతమ్మ గారు లేరు. వరదప్పగారు లేరు. ఇప్పుడు పునీత్ కూడా లేడంటే నిజంగా తట్టుకోలేకపోతున్నాను. చాలా చిన్న వయసు. ఒక నెల క్రితం ఇద్దరం మాట్లాడుకున్నాం. సరదాగా కలుద్దాం అనుకున్నాం. కలిసేలోపు ఇలా జరిగిపోయింది. పునీత్ మరణం కుటుంబానికే కాదు, ఫ్యాన్స్ కే కాదు, కన్నడ ఇండస్ట్రీకి పెద్ద లోటు. లవ్ యు పునీత్. రియల్లీ మిస్ యూ" అంటూ వీడియో ద్వారా తన సందేశాన్ని తెలిపారు పూరి.
కాగా పూరి దర్శకత్వంలో వచ్చిన 'అప్పు' సినిమాతోనే పునీత్ హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. తర్వాత ఇదే సినిమాను 'ఇడియట్' పేరుతో తెలుగులో రవితేజతో చేసి ఇక్కడ సూపర్ హిట్ అందుకున్నారు పూరి.
![]() |
![]() |