![]() |
![]() |

(అక్టోబర్ 26 అసిన్ 36వ పుట్టినరోజు సందర్భంగా..)
14 ఏళ్ళ కెరీర్, 4 భాషలు, 25 చిత్రాలు.. ఇదీ క్లుప్తంగా కేరళకుట్టి అసిన్ అభినయ పర్వం. రాశి కంటే వాసికే ప్రాధాన్యమిచ్చిన ఈ నిన్నటి తరం అగ్ర కథానాయిక.. తన మాతృభాష మలయాళంలో కేవలం ఒక చిత్రానికే పరిమితం కాగా తమిళంలో 11 సినిమాలు, తెలుగులో 6 చిత్రాలు, హిందీలో 7 సినిమాలు చేసింది. ఏవో ఒకట్రెండు చిత్రాలను మినహాయిస్తే.. దాదాపు అన్నీ సినిమాల్లోనూ అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లోనే దర్శనమిచ్చింది అసిన్.
తెలుగు చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే.. అసిన్ ఇక్కడ నటించిన ఆరు సినిమాలు కూడా అగ్ర కథానాయకుల కాంబినేషన్ లోనే రూపొందాయి. తొలి తెలుగు చిత్రం `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` (2003)లో మాస్ మహారాజా రవితేజ హీరో కాగా.. ఆపై వచ్చిన `శివమణి` (2003)లో కింగ్ నాగార్జున, `లక్ష్మీ నరసింహా` (2004)లో నటసింహం బాలకృష్ణ, `ఘర్షణ` (2004)లో విక్టరీ వెంకటేశ్, `చక్రం` (2005)లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, `అన్నవరం` (2006)లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకులు. వీరందరి సరసన కూడా అసిన్ చూడచక్కని జంటగా కనువిందు చేయడం విశేషమనే చెప్పాలి.
మరీముఖ్యంగా, ఓ తరం అగ్ర కథానాయకులైన నాగ్, బాలయ్య, వెంకీతో అసిన్ తన వరుస తెలుగు చిత్రాలు `శివమణి`, `లక్ష్మీ నరసింహా`, `ఘర్షణ` చేయడమే ఓ అరుదైన విషయమైతే.. ఆ మూడింటిలోనూ ఆ ముగ్గురు పవర్ ఫుల్ పోలీస్ పాత్రల్లో కనిపించడం మరో అరుదైన సంగతి. బహుశా.. తెలుగునాట కాప్ స్టోరీల పరంగా ఇలాంటి అరుదైన ఘనత ఒక్క అసిన్ కే దక్కుతుందేమో!
![]() |
![]() |