![]() |
![]() |

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు ఓడిపోయిన ప్రకాశ్‌రాజ్ కంటే ఆయనను బలంగా సపోర్ట్ చేసిన మెగా బ్రదర్ నాగబాబుకే ఎక్కువ షాక్ నిచ్చాయి. ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీచేసి ఓటమి పాలైన ప్రకాశ్‌రాజే హుందాగా తన ఓటమిని అంగీకరించి, తెలుగు బిడ్డ గెలిచాడంటూ మంచు విష్ణును అభినందించారు. కానీ తను సపోర్ట్ చేసిన ప్రకాశ్‌రాజ్ ఓడిపోయి, విష్ణు గెలవడం తట్టుకోలేకపోయారు నాగబాబు. అందుకే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించారు.
"ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టులాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక "మా" అసోసియేషన్లో "నా" ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను... సెలవు. - నాగబాబు" అంటూ ఆయన ట్వీట్ చేశారు. దాంతో పాటు మిగతా వారందరి దారి ఒకటైతే, తనది వేరే దారి అన్నట్లు అర్థంవచ్చే ఒక చిత్రాన్నిఆయన షేర్ చేశారు.

'మా'ను నడిపించుకోవడం మనకు చేతకాదా, దానికి పరాయివాళ్ల చేతుల్లో పెట్టాలా అంటూ పలువురు నటులు బాహాటంగా విమర్శలు చేశారు. దాంతో ప్రకాశ్‌రాజ్‌కు ప్రాంతీయతను ఆపాదించడం కూడదనీ, ఆయన భారతీయ నటుడనీ, తెలుగు నటుల కంటే ఆయన గొప్ప నటుడనీ నాగబాబు ఆయనను మోస్తూ వచ్చారు. ఈ క్రమంలో కోట శ్రీనివాసరావు లాంటి గొప్ప నటుడ్ని కూడా ఆయన కించపరుస్తూ మాట్లాడారు. ఇది 'మా' సభ్యుల్లో చాలా మందికి ఆగ్రహాన్ని కలిగించింది. అందుకే వందకు పైగా ఓట్ల తేడాతో ప్రకాశ్‌రాజ్‌ను ఓడించారు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదేమైనా, ప్రకాశ్‌రాజ్‌పై తెలుగు నటుల వ్యతిరేకతకు నాగబాబు అనుచిత వ్యాఖ్యలే దోహదం చేశాయనేది విశ్లేషకుల అభిప్రాయం.
![]() |
![]() |