![]() |
![]() |

తమిళ స్టార్ యాక్టర్ దళపతి విజయ్‌కు, తనకు మధ్య సమస్యలు ఉన్నాయని ఆయన తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్ ఇంటి బయట తన భార్య శోభతో కలిసి తాను కారులో వేచి ఉన్నానని చెప్పారు. అయితే విజయ్.. తన తల్లిని ఇంట్లోకి రమన్నారని ఆయన తెలిపారు. ఎప్పట్లాగే శోభ, విజయ్ మాట్లాడుకున్నారని ఆయన వెల్లడించారు. కానీ శోభ, విజయ్ మధ్య ఎలాంటి సమస్యలు లేవని... వారు తరచుగా మాట్లాడుకుంటూ ఉంటారని... అలాగే కలుసుకుంటూ ఉంటారని.. వారిరువురు సంతోషంగానే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్.ఎ. చంద్రశేఖర్ ఓ వీడియో విడుదల చేశారు.
అయితే ఇటీవల తాను ఇచ్చిన ఇంటర్వ్యూ కథనాన్ని ఓ తమిళ వారపత్రికకు తప్పుగా ప్రచరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను, తన భార్య శోభ.. తమ కుమారుడు విజయ్ ఇంటి బయట వేచి ఉండి.. అతడిని కలవకుండా ఇద్దరం వెనక్కి వచ్చేశామనే కథనంలో ఎలాంటి నిజం లేదన్నారు. ఈ కథనం వల్ల తనకు, విజయ్‌కు మధ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తమిళ స్టార్ హీరో విజయ్.. తమిళ ప్రేక్షకుల ఆరాధ్య నటుడు. తెలుగు ప్రేక్షకుల్లోనూ ఇటీవలి కాలంలో అతనికి మంచి ఇమేజ్ వచ్చింది. ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ 'ఆలిండియా దళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్' పేరు మీద రాజకీయ పార్టీని స్థాపించి... కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర పార్టీ పేరును నమోదు చేశారు. దాంతో అప్పట్లో హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం చేయబోతున్నాడంటూ వార్తలు వెల్లువెత్తాయి. కానీ తన తండ్రి స్థాపించిన పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయ్ ప్రకటించారు. ఈ పార్టీలో విజయ్ తండ్రి జనరల్ సెక్రెటరీగా, తల్లి శోభ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టారు. కాగా తనను సంప్రదించకుండా తన పేరుతో రాజకీయ పార్టీ పెట్టడంపై తల్లిదండ్రులతో పాటు మొత్తం 11 మందిపై చెన్నైలోని సివిల్ కోర్టులో ఇటీవల విజయ్ కేసు పెట్టారు.
తమిళంలో బాలనటుడిగా ప్రవేశించి హీరోగా మారి రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్‌గా పేరుపొందాడు విజయ్. ప్రస్తుతం ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను విజయ్ అలరిస్తున్నాడు. త్వరలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా పాన్ ఇండియా సినిమాను నిర్మించేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |