![]() |
![]() |

రెండు 'బాహుబలి' సినిమాలు తెచ్చిన అమేయమైన ఇమేజ్ తర్వాత ప్రభాస్ చేస్తూ వస్తోన్న సినిమాలపై అంచనాలు ఎలా ఉంటున్నాయో 'సాహో' సినిమాతో చూశాం. ఏ హీరోకైనా కనీ వినీ ఎరుగని హిట్ వచ్చిందంటే, ఆ తర్వాత అతనిపై ఉండే ఒత్తిడి అసాధారణం. ప్రేక్షకుల అంచనాలు అంబరాన్నటుతాయి. వాటిని అందుకోవడం కష్టమైపోతుంది. గతంలో చాలమంది హీరోల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు ప్రభాస్ విషయంలోనూ అదే జరిగింది. నార్త్‌లో తప్ప మిగతా ఏరియాల్లో 'సాహో' అంచనాలను అందుకోలేక ఫ్లాపయింది.
ప్రభాస్ ఇప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన హీరో కాదు. దేశంలోని అనేక భాషల అభిమాన నటుడు. గతంలో ఏ తెలుగు నటుడికీ దక్కని అరుదైన గౌరవం ఇది. ఆ బరువు బాధ్యతల్ని మోస్తూ ప్రభాస్ ఇప్పుడు 'రాధే శ్యామ్' సినిమా చేస్తున్నాడు. అందుకే మామూలు సినిమాలా కాకుండా తెలుగుతో పాటు హిందీ భాషలోనూ ఏక కాలంలో నిర్మిస్తున్నారు. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి విడుదల చేసే లక్ష్యంతో సూపర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చాలా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని టి-సిరీస్‌తో కలిసి యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
తొలి సినిమా 'జిల్'తో ఆకట్టుకున్న దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాని హై స్టాండర్డ్స్‌తో రూపొందిస్తున్నాడు. 19 ఏళ్ల కెరీర్‌లో ప్రభాస్ చేసింది 19 సినిమాలే. అంటే ఏడాదికి సగటున ఒక్క సినిమానే. 2002 నుంచి 2013 వరకు పన్నెండేళ్ల కాలంలో 16 సినిమాలు చేసిన ప్రభాస్, ఆ తర్వాత ఎనిమిదేళ్లలో చేసింది 3 సినిమాలే. అవి 'బాహుబలి: ద బిగినింగ్', 'బాహుబలి: ద కన్‌క్లూజన్', 'సాహో'.
ఇప్పుడు చేస్తున్న 'రాధే శ్యామ్' సినిమా ప్రొడక్షన్ వర్క్ 2018లోనే మొదలైంది. ఆ ఏడాది అక్టోబర్‌లో షూటింగ్ మొదలు కాగా, హైదరాబాద్, ట్యూరిన్, జార్జియాలో చిత్రీకరణ జరిపారు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేశారు. జనవరి 14న సంక్రాంతి పర్వదినాన 'రాధే శ్యామ్'ను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ చేస్తున్న పూర్తి స్థాయి లవ్ స్టోరీ ఇది. ఆయన జోడీగా ఫస్ట్ టైమ్ పూజా హెగ్డే నటించింది. ఇంతకీ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ బరువును తట్టుకొని 'రాధే శ్యామ్'తో ప్రభాస్ నిలబడతాడా?
![]() |
![]() |