![]() |
![]() |

సూపర్ స్టార్ కృష్ణ, అతిలోక సుందరి శ్రీదేవి.. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. వాటిలో `పచ్చని కాపురం` ఒకటి. బాలీవుడ్ మూవీ `ప్యార్ ఝుక్తా నహీ` (1985)కి రీమేక్ గా రూపొందిన ఈ సినిమాని తాతినేని రామారావు డైరెక్ట్ చేయగా.. శ్రీ రాజ్యలక్ష్మీ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై మిద్దే రామారావు నిర్మించారు. ఇందులో జగ్గయ్య, కాంతారావు, షావుకారు జానకి, మాస్టర్ అర్జున్, అభిలాష, రాజ్యలక్ష్మి ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా.. నూతన్ ప్రసాద్, వైజీ మహేంద్రన్ అతిథి పాత్రల్లో మెరిశారు.
దిగ్గజ స్వరకర్త చక్రవర్తి బాణీలు అందించిన ఈ చిత్రంలోని గీతాలన్నీ ప్రజాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. మూడు వెర్షన్స్ తో రూపొందిన ``వెన్నెలైనా చీకటైనా`` చార్ట్ బస్టర్ గా నిలిచింది. హిందీ వెర్షన్ లోని ``తుమ్ సే మిల్ కర్` గీతం తాలుకూ ఒరిజినల్ ట్యూన్ ని ఈ పాట కోసం యథాతథంగా వినియోగించారు. ``వెన్నెలైనా చీకటైనా`` డ్యూయెట్ వెర్షన్ ని కేజే యేసుదాస్, ఎస్. జానకి గానం చేయగా, ఫిమేల్ వెర్షన్ ని జానకి - మేల్ వెర్షన్ ని యేసుదాస్ ఆలపించారు. అంతేకాదు.. పాటలన్నింటికీ దిగ్గజ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యమందించగా, ఇందులో కృష్ణపై చిత్రీకరించిన గీతాలన్నింటికి యేసుదాస్ నే గాత్రమందించడం విశేషం. 1985 సెప్టెంబర్ 6న విడుదలై మంచి విజయం సాధించిన `పచ్చని కాపురం`.. నేటితో 36 వసంతాలు పూర్తిచేసుకుంది.
![]() |
![]() |