![]() |
![]() |

తెలుగునాట ఎన్నో కుటుంబ కథా చిత్రాలు సందడి చేశాయి. అయితే, ఆబాలగోపాలాన్ని అలరించి ఆల్ టైమ్ క్లాసిక్స్ గా నిలిచిన సినిమాలు మాత్రం కొన్నే. వాటిలో.. `నువ్వు నాకు నచ్చావ్` ఒకటి. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన ఈ ఎవర్ గ్రీన్ సినిమాని కె. విజయభాస్కర్ రూపొందించారు. ఆర్తి అగర్వాల్ కథానాయికగా పరిచయమైన ఈ చిత్రానికి కోటి స్వరాలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు ప్రధాన బలంగా నిలిచాయి. కుటుంబ బంధాలు, స్నేహం, ప్రేమ, హాస్యం, పాటలు, భావోద్వేగాలు, నటీనటుల అభినయం, దర్శకత్వ ప్రతిభ, నిర్మాణ విలువలు, సంభాషణలు.. ఇలా ఇందులోనీ ప్రతీ అంశం తెలుగు ప్రేక్షకుడ్ని మెప్పించింది. రివార్డులతో పాటు అవార్డులు, రికార్డులు కూడా వశమయ్యాయి. 2001 సెప్టెంబర్ 6న విడుదలై అఖండ విజయం సాధించిన `నువ్వు నాకు నచ్చావ్`.. నేటితో 20 వసంతాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు..
* దర్శకుడు కె. విజయభాస్కర్ తో వెంకీకి ఇదే మొదటి సినిమా. ఆ తరువాత ఈ ఇద్దరి కలయికలో `మల్లీశ్వరి` (2004), `మసాలా` (2013) వచ్చాయి.
* వెంకటేశ్ సినిమాకి త్రివిక్రమ్ సంభాషణలు అందించడం ఇదే మొదటి సారి. ఆపై వెంకీ హీరోగా నటించిన `వాసు` (2002), `మల్లీశ్వరి` (2004) చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు రాశారు. అలాగే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన `అజ్ఞాతవాసి` (2018)లో వెంకీ అతిథిగా సందడి చేశారు.
* కథానాయిక ఆర్తి అగర్వాల్ కి ఇదే మొదటి తెలుగు సినిమా. ఈ చిత్రం ఘనవిజయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు ఆర్తి. ఇక ఈ సినిమా తరువాత వెంకీతో ఆర్తి జట్టుకట్టిన `వసంతం` (2003), `సంక్రాంతి` (2005) కూడా విజయపథంలో పయనించి.. వీరిని హ్యాట్రిక్ జోడీగా నిలిపాయి.
* `స్వయంవరం` (1999), `నువ్వే కావాలి` (2000) వంటి విజయవంతమైన చిత్రాల తరువాత కె. విజయభాస్కర్ తెరకెక్కించిన సినిమా ఇది. ఈ చిత్రంతో దర్శకుడిగా విజయభాస్కర్ హ్యాట్రిక్ డైరెక్టర్ గా నిలిచారు. అలాగే త్రివిక్రమ్ తోనూ ఆయనకి హ్యాట్రిక్ మూవీ.
* 113 ప్రింట్లతో 147 కేంద్రాలలో విడుదలైన `నువ్వు నాకు నచ్చావ్`.. 93 కేంద్రాలలో 50 రోజులు, 57 కేంద్రాలలో 100 రోజులు, 3 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శితమైంది.
* కన్నడలో `గౌరమ్మ` (ఉపేంద్ర, రమ్య), తమిళంలో `వశీగర` (విజయ్, స్నేహ), బెంగాలీలో `మజ్ను` (హిరణ్, స్రబంతి) పేర్లతో `నువ్వు నాకు నచ్చావ్` రీమేక్ అయింది.
* `బెస్ట్ హోమ్ - వ్యూయింగ్ ఫీచర్ ఫిల్మ్`, `బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్` (సుహాసిని), `బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ యాక్ట్రస్` (సవితా రెడ్డి), `బెస్ట్ డైలాగ్ రైటర్` (త్రివిక్రమ్), `బెస్ట్ కొరియోగ్రాఫర్` (సుచిత్ర) విభాగాల్లో ఈ చిత్రానికి `నంది` పురస్కారాలు దక్కాయి.
![]() |
![]() |