![]() |
![]() |

డ్రగ్ కేసులో మనీ లాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన కోణంలో టాలీవుడ్ సెలబ్రిటీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించడం ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట పూరి జగన్నాథ్‌ను 10 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు నిన్న పూరి సన్నిహితురాలు, బిజినెస్ పార్టనర్ చార్మిని సుదీర్ఘ సమయం ప్రశ్నించారు. అనంతరం ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన ఆమెను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. "ఈడీ ఏం అడిగారు? మీరేం చెప్పారు?" అంటూ ప్రశ్నించారు.
దీనికి చార్మి బదులిస్తూ, "ఈడీ డిపార్ట్‌మెంట్ ఏ డాక్యుమెంట్లు అండిగారో అవన్నీ సబ్మిట్ చేశాను. నా సైడ్ నుంచి పూర్తిగా సహకరించాను. వాళ్లడిగిన వాటికన్నింటికీ సమాధానమిచ్చాను, డాక్యుమెంట్లు అందజేశాను. వాళ్లకు ఎప్పుడూ నానుంచి సహకారం ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడితే అది చట్టానికి వ్యతిరేకం అవుతుంది. అర్థం చేసుకోండి" అని చెప్పారు. "మళ్లీ రమ్మని చెప్పారా?" అనే ప్రశ్నకు ఆమె జవాబివ్వలేదు. నేరుగా కారులోకి వెళ్లి కూర్చుని, అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
ఆమె చెప్పిన దాన్ని బట్టి ఈడీ అధికారులు ఆమె బ్యాంక్ లావాదేవీలను అడిగారనీ, వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆమె అందజేసిందనీ అర్థమవుతుంది. అయితే డ్రగ్స్ వాడకం గురించి ఏమైనా అడిగిందీ, లేనిదీ మాత్రం వెల్లడి కాలేదు.
మొత్తానికి డ్రగ్ కేసు టాలీవుడ్‌లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. మనీ లాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన అభియోగాలపై 12 మంది తెలుగు సినీ సెలబ్రిటీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ నిమిత్తం సమన్లు జారీ చేసింది. దీంతో ఈ డ్రగ్ కేసు ఏ మలుపు తీసుకుంటుందోననే ఆసక్తీ, ఆందోళన ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
నేడు రకుల్‌ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8న రానా దగ్గుబాటి, 9న మాస్ మహారాజా రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్‌ను విచారించేందుకు ఈడీ రెడీ అవుతోంది. ఆ తర్వాత సెప్టెంబర్ 13న నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్, 15న ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ ముమైత్ ఖాన్, 17న యువనటుడు తనీశ్, 20న నటుడు నందు, 22న హీరో తరుణ్ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరవనున్నారు.
![]() |
![]() |