![]() |
![]() |

పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న 'భీమ్లా నాయక్' మూవీలోని టైటిల్ సాంగ్ ఈరోజు ఆయన బర్త్‌డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ పాటలో "ఆడా కాడు ఈడా కాదు అమీరోళ్ల మేడా కాదు" అంటూ కిన్నెర వాయిస్తూ, సాకీని పాడుతూ ఒకాయన దర్శనమిచ్చాడు. ఆయనెవరా? అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి.. దర్శనం మొగిలయ్య. తెలంగాణ జానపద కళాకారుడు. మొగిలయ్య సాకీతో ఆ పాటకు వన్నె వచ్చింది. మొదట్నుంచీ తన సినిమాల్లో జానపద బాణీలను ఎంకరేజ్ చేస్తూ వస్తున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు మొగిలయ్యకు తన పాటలో స్థానం కల్పించి, ఆయనను గౌరవించారు.
ఇంతకీ మొగిలయ్య నేపథ్యమేంటి? ఆయన 12 మెట్లు ఉండే కిన్నెర వాద్యకారుడు. చూడ్డానికి వీణ లాగా ఉండే కిన్నెర, దానంత బరువు ఉండకుండా కాస్త తేలిగ్గా ఉంటుంది. మొగిలయ్య మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట వాస్తవ్యుడు. డక్కలి కులస్తుడు. పన్నెండు మెట్ల కిన్నెరను వాయించే వంశంలో పుట్టిన ఐదో తరం కళాకారుడు మొగిలయ్య. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ పాటలతో యువతలో స్ఫూర్తినింపిన వారిలో ఆయన ఒకరు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన ఉగాది పురస్కారాల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు మొగిలయ్య. కానీ ఆయన ఆర్థిక స్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆర్థికంగా ఏ పరిస్థితిలో ఉన్నారో ఇప్పటికీ అదే స్థితి ఆయనది.

ఇవాళ 12 మెట్ల కిన్నెరను వాయించే కళాకారుడు మొగిలయ్య కాకుండా మరొకరు లేరు. నిన్నటిదాకా వికారాబాద్ జిల్లా మంబాపూర్‌కు చెందిన డక్కలి బాలమ్మ కుటుంబ పోషణ నిమిత్తం కిన్నెర వాయిద్యం వాయించేవారు. 95 ఏళ్ల వయసులో ఆమె ఈమధ్య మృతి చెందారు. కిన్నెర అనే వాయిద్యం ఒకటి ఉన్నదనే విషయం నేటి సంగీతకారులకే తెలీదు, ఇక సామాన్య జనానికి ఏం తెలుస్తుంది! ఆధునిక ఎలక్ట్రానిక్ వాయిద్యాల మాటున కిన్నెర కనిపించకుండా పోయింది. ఇప్పుడు 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్‌లో సాకీ పాడుతూ, 12 మెట్ల కిన్నెరను వాయిస్తూ మొగిలయ్య కనిపించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. పవర్‌స్టార్ లాంటి టాప్ హీరో సినిమాలో పాట పాడుతూ ఆయన కనిపించడం చిన్న విషయమైతే కాదు.
![]() |
![]() |