![]() |
![]() |

డ్రగ్ కేసులో మనీ లాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘనల కోణంలో టాలీవుడ్ సెలబ్రిటీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం (ఆగస్ట్ 31) విచారణ ప్రారంభించింది. తొలుత టాప్ డైరెక్టర్లలో ఒకరైన పూరి జగన్నాథ్‌ను పది గంటలకు పైగా సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు నేడు పూరి సన్నిహితురాలు, ఆయన బిజినెస్ పార్టనర్ నటి చార్మిని విచారించేందుకు రెడీ అయ్యారు. డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా చార్మికి ఈడీ నోటీసులు జారీ చేసింది.
విచారణ సందర్భంగా చార్మి బ్యాంక్ అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. చార్మి నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్‌కు సంబంధించిన లావాదేవీలను కూడా వారు పరిశీలించనున్నట్లు సమాచారం. కెల్విన్ బ్యాంక్ అకౌంట్‌లోకి చార్మి పెద్ద మొత్తంలోనే అమౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఈడీ దగ్గర ఆధారాలున్నాయని అంటున్నారు. పూరికి సంబంధించిన వ్యవహారాల గురించి కూడా ఆమెను ప్రశ్నించే అవకాశాలున్నాయి. పూరి తరహాలోనే చార్మి సైతం సుదీర్ఘ విచారణను ఎదుర్కోనున్నారు.
మొత్తానికి డ్రగ్ కేసు టాలీవుడ్‌లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. మనీ లాండరింగ్, ఫెమా చట్టాల ఉల్లంఘన అభియోగాలపై 12 మంది తెలుగు సినీ సెలబ్రిటీలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ నిమిత్తం సమన్లు జారీ చేసింది. దీంతో ఈ డ్రగ్ కేసు ఏ మలుపు తీసుకుంటుందోననే ఆసక్తీ, ఆందోళన ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
సెప్టెంబర్ 6న హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, 8న హీరో-విలన్ రానా దగ్గుబాటి, 9న మాస్ మహారాజా రవితేజ, ఆయన డ్రైవర్ శ్రీనివాస్‌ను విచారించేందుకు ఈడీ రెడీ అవుతోంది. ఆ తర్వాత సెప్టెంబర్ 13న నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్, 15న ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ ముమైత్ ఖాన్, 17న యువనటుడు తనీశ్, 20న నటుడు నందు, 22న హీరో తరుణ్ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరవనున్నారు.
![]() |
![]() |