![]() |
![]() |

నేచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'టక్ జగదీష్'. ఈ సినిమాలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది.
'భూదేవిపురం గురించి మీకో కథ చెప్పాలి' అనే వాయిస్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 'ఆ వీరేంద్రకి భయపడకుండా జనం కోసం ఎవరో ఒకరు నిలబడాలి కదా' అని జగపతిబాబు అనగానే.. స్టైలిష్ గా ఫైట్ చేస్తూ నాని ఎంట్రీ ఇవ్వడం మెప్పిస్తోంది. ట్రైలర్ ని బట్టి చూస్తుంటే ఇది ప్రధానంగా అన్నదమ్ముల మధ్య సాగే కథ అని అర్థమవుతోంది. సవతి తల్లిని, ఆమె కుమారుడు నానిని.. జగపతి బాబు తమ కుటుంబసభ్యులుగా అంగీకరించకపోవడం ట్రైలర్ లో కనిపిస్తోంది. 'భూ కక్షలు లేని భూదేవిపురం చూడాలనేది మా నాన్న కోరిక. ఇప్పుడది నా బాధ్యత' అని నాని చెప్పిన డైలాగ్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. మొత్తానికి ఓ వైపు ఫ్యామిలీ ఎమోషన్స్, మరోవైపు పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచిందనే చెప్పాలి.
'నిన్నుకోరి' తర్వాత నాని-శివ నిర్వాణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'టక్ జగదీష్'పై మంచి అంచనాలే ఉన్నాయి. మరి గతేడాది 'V' సినిమాను ఓటీటీలో విడుదల చేసి అంతగా ఆకట్టుకోలేకపోయిన నాని.. 'టక్ జగదీష్'తో మెప్పిస్తాడేమో చూడాలి.
![]() |
![]() |