![]() |
![]() |

ఉదయం 11 గంటల నుంచి డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ ఆధ్వర్యంలో ప్రధానంగా మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన కోణంలో ఈ విచారణ నడుస్తోంది. హైదరాబాద్, బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలోని మూడో ఫ్లోర్‌లో పూరీని అధికారులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా 2015 నుంచి ఆయన బ్యాంక్ అకౌంట్ల స్టేట్‌మెంట్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పూరితో పాటు ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ కూడా ఈ బ్యాంక్ లావాదేవీలను అధికారులకు వివరించారు.
ఈడీ అధికారులు ప్రధానంగా పూరి బ్యాంక్ లావాదేవీలపైనే దృష్టిపెట్టి, వాటికి సంబంధించిన విషయాలను కూపీ లాగుతున్నారు. 11 గంటలకు విచారణ మొదలవగా, మధ్యలో భోజన విరామం ఇచ్చి, తిరిగి విచారణ కొనసాగిస్తున్నారు. 2015 నుంచి ఆయన చేసిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీటిలో పలు విదేశీ బ్యాంక్ అకౌంట్లకు జరిపిన లావాదేవీలు ఉన్నాయనీ, వీటికి సంబంధించిన వివరాలను కూపీ లాగుతున్నారనీ సమాచారం.
"మీరు డ్రగ్స్ వాడారా? ఎవరి నుంచి వాటిని కొనుగోలు చేశారు, ఎంత డబ్బు చెల్లించారు? ఏ విధానంలో చెల్లించారు?".. లాంటి ప్రశ్నలను ఈడీ అధికారుల నుంచి పూరి ఎదుర్కొన్నారు. బ్యాంక్ స్టేట్‌మెంట్లలోని పలు అనుమానిత లావాదేవీల గురించి ఆయనను గుచ్చిగుచ్చి అడిగారని తెలుస్తోంది. ఎన్నడో ముగిసిందని టాలీవుడ్ ఊపిరి పీల్చుకున్న డ్రగ్ కేసును ఇప్పుడు ఈడీ తిరగతోడటం, మనీ లాండరింగ్ కోణంలో విచారిస్తుండటంతో.. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
![]() |
![]() |