![]() |
![]() |

మునుపటి సినిమా 'క్రాక్' బ్లాక్‌బస్టర్ కావడంతో రవితేజ మళ్లీ రిథమ్‌లోకి వచ్చాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అంతకు ముందు వరుసగా నాలుగు ఫ్లాపులు, డిజాస్టర్లు రావడంతో వారు చాలా ఆందోళన చెందారు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన 'క్రాక్', మునుపటి సురేందర్‌రెడ్డి 'కిక్'ను మించి హిట్టవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఆ సినిమా నిర్మాతకూ, బయ్యర్లకు భారీ లాభాలు లభించాయి. వాస్తవానికి ఆ సినిమా విడుదలకు ముందు రవితేజ, గోపీచంద్ సహా అందరూ చాలా టెన్షన్ పడ్డారు. కానీ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజయ్యిందో, అప్పట్నుంచీ సినిమాపై పాజిటివ్ టాక్ స్ర్పెడ్ అవుతూ వచ్చింది.
సినిమా విడుదలయ్యాక రవితేజ లుక్స్‌కు కూడా ఆడియెన్స్ ఇంప్రెస్ అయ్యారు. అదివరకు ఆయన ముఖంలో కనిపించని గ్రేస్ ఈ సినిమాలో కొట్టొచ్చినట్లు కనిపించింది. వయసు మీదపడుతున్నా యంగ్ లుక్‌లో దర్శనమిచ్చాడు రవితేజ. ఈ నేపథ్యంలో త్వరలో 'ఖిలాడి'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఇద్దరు హీరోయిన్లు.. మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. చెప్పాలంటే ఆ ఇద్దరూ కొత్త తారలు కిందే లెక్క. డింపుల్ హయతి క్యారెక్టర్‌లో ట్విస్ట్ ఉన్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
'క్రాక్' మూవీ సూపర్ డూపర్ హిట్టవడం, ఆ మూవీలో రవితేజ సూపర్ ఎనర్జిటిక్‌గా కనిపించడంతో, ఇప్పుడందరి దృష్టీ 'ఖిలాడి' మీదే ఉంది. గతంలో రమేశ్‌వర్మతో రవితేజ చేసిన 'వీర' సినిమా ఫ్లాపయంది. ఆ చేదు జ్ఞాపకాన్ని 'ఖిలాడి' తుడిచిపెట్టేస్తుందనీ, రవితేజ ఖాతాలో వరుసగా రెండో హిట్ పడుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. పదేళ్ల క్రితం 'డాన్ శీను', 'మిరపకాయ్' సినిమాలతో రెండు వరుస హిట్లు కొట్టాక, మళ్లీ ఆ ఫీట్ రవితేజ నుంచి రాలేదు. ఇప్పుడు దాన్ని సాధిస్తాడా, లేదా.. అనే ఆసక్తి ఫ్యాన్స్‌లో వ్యక్తమవుతోంది.
![]() |
![]() |