![]() |
![]() |

చిన్నతనంలో నాగార్జున సంక్రాంతి పండుగకు తమ అమ్మానాన్నలతో గుడివాడకూ, దెందులూరుకూ వెళ్లేవారు. గుడివాడ అక్కినేని నాగేశ్వరరావు సొంతూరయితే, దెందులూరు అక్కినేని అన్నపూర్ణ గారి ఊరు. అన్నపూర్ణగారి పుట్టింటితో పోలిస్తే ఏఎన్నార్‌గారి గుడివాడ ఇల్లు చిన్నది. అందుకని ఎక్కువగా దెందులూరులోని అమ్మమ్మవాళ్ల ఇంటికి ఎక్కువగా వెళ్లేవారు. చిన్నా పెద్ద అంతా బోగిమంటల దగ్గర చలికాచుకోవడం, అందరూ కలిసి సామూహిక భోజనాలు చేయడం తలచుకుంటే ఇప్పుడు ఆయనకు చాలా హాయిగా అనిపిస్తుంటుంది.
నాగ్, వాళ్లన్నయ్య వెంకట్ పెద్దవాళ్లయ్యాక అమ్మమ్మ ఊరు వెళ్లడం తగ్గిపోయింది. నాగ్ రెండున్నరేళ్ల వయసు నుంచే హైదరాబాద్‌లో పెరిగారు. హైదరాబాద్ అంటే పతంగులకు ఫేమస్ కదా. అలా చిన్నతనంలో గాలిపటాలు ఆయన బాగానే ఎగరేశారు.
అమ్మానాన్నల్ని మిస్సవుతున్నానన్న ఫీలింగ్ నాగ్‌లో కచ్చితంగా ఉంది. "కానీ వాళ్లను తలచుకున్నప్పుడల్లా మొహంపై బాధ కాకుండా ఓ నవ్వు వస్తుంది నాకు. నాన్న ఓ కంప్లీట్ మ్యాన్. పనిలో కానీ, కుటుంబానికి కానీ ఆయన ఏం చేసినా అది సంపూర్ణంగా చేశారు. పనిమీద శ్రద్ధ, జీవితంలో డిసిప్లిన్‌తో గొప్ప గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఇక్కడొక మాట, అక్కడొక మాట చెప్పడం ఆయనకు తెలీదు. ఓ మనిషి వ్యక్తిత్వానికి ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. మాకు అవే స్ఫూర్తి. ఆయన పిల్లలుగా మేం వాటిని ఆచరించాలి, ఆచరిస్తున్నాం." అని చెప్పారు నాగార్జున.
ఇంటర్నెట్ యుగంలో బంధాలు పలుచనవుతున్నాయని చాలామంది ఫీలవుతున్నారు. కానీ ఆయన అందుకు భిన్నంగా అభిప్రాయపడుతున్నారు. "మనుషులు కలవడం తగ్గిందేమో కానీ, ఫోన్‌లో మాట్లాడుకోవడం ఎక్కువైంది. సంతోషంగా 'స్కైప్'లో మాట్లాడుకుంటున్నారు. మనిషి అన్న తర్వాత కుటుంబం లేకుండా ఉండలేడు. లేకపోతే అతను మనిషి కాడు. నేను షూటింగ్‌లో ఉంటాను కాబట్టి అన్నయ్యను రోజూ కలవడం కుదరదు. ఇద్దరం ఫోన్‌లో మాట్లాడుకుంటాం. సెల్‌ఫోన్ లేనప్పుడు అలా కుదిరేది కాదు. అంటే ఇప్పుడే అనుబంధాలు ఎక్కువయ్యాయంటాను." అని నాగ్ చెప్పుకొచ్చారు.
![]() |
![]() |